*భూభారతి: రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
రాష్ట్ర ప్రజలకు భూభారతి చట్టం ఎలా ఉపయోగపడుతుందో త్వరలోనే తెలుస్తుందని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అత్వెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ధరణిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న మంత్రి, భూభారతిలో వాటికి పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతులు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు. సాదా బైనామా, భూధార్, న్యాయపరమైన సమస్యలకు భూభారతి చట్టంలో పరిష్కారం ఉంటుందని, ఎమ్మార్వో స్థాయి నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు అధికారులు సమస్యలు పరిష్కరించే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా సర్వే మ్యాప్ ఉంటుందని, తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా ఈ చట్టంలో ఉంటుందని మంత్రి తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ, ధరణిలోని సమస్యలను తొలగించి, రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. అనుభవజ్ఞులైన రిటైర్డ్ ఉద్యోగులు, నిపుణులతో చర్చించి ఈ చట్టాన్ని రూపొందించామని తెలిపారు. ధరణిలో రెవెన్యూ అధికారులకు అధికారాలు లేకపోవడంతో సమస్యలు కోర్టుల వరకు వెళ్లాయని, భూభారతిలో తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ స్థాయి వరకు సమస్యలను పరిష్కరించే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.
భూ కొనుగోలు, అమ్మకాలతో పాటు భూ రికార్డుల్లో పేర్ల మార్పులకు ధరణిలో ఇబ్బందులు ఎదురయ్యాయని, భూభారతి ద్వారా భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారా గ్రామాల్లోని చిన్న చిన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని, భూధార్ ద్వారా శాటిలైట్ ఆధారంగా భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించామని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా సర్వే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీని కోసం వేల సంఖ్యలో సర్వేయర్లను నియమిస్తామని తెలిపారు.
భూభారతి చట్టంపై నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించారని, ఈ చట్టంలోని వివరాలను ప్రజలు ఇతరులకు వివరించాలని కలెక్టర్ కోరారు. భూభారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉన్నాయని, రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.