*‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్లతో మంత్రి సీతక్క సమీక్ష**
రాష్ట్రంలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభించిన ‘ఇందిరా మహిళా శక్తి’ కార్యక్రమాల పురోగతిపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల ఏర్పాటు, నూతన సభ్యుల గుర్తింపు, కిశోర బాలికలు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంఘాల ఏర్పాటు, ఇందిరమ్మ మహిళా శక్తి భవనాల నిర్మాణ పురోగతి, సర్కారీ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫాం సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, “తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్య సాధనలో మహిళల పాత్ర అత్యంత కీలకం” అని తెలిపారు. అందుకే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి 18 ఏళ్లపైబడిన మహిళను ఓటర్ లిస్టు ఆధారంగా మహిళా సంఘాల్లో చేర్చాలనీ, కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ మహిళలు, దివ్యాంగులు, వయోధికుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలవుతున్న పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరణ ఇచ్చారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయనీ, కలెక్టర్లు మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచించారు.
ఈ సమావేశంలో పీఆర్ఆర్డీ సెక్రటరీ లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, ట్రాన్స్జెండర్ సాధికార శాఖ డైరెక్టర్ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.