రాహుల్ గాంధీ యాత్రపై బిజెపి కన్నా బీఆర్ఎస్ ఎక్కువ ఆందోళన చెందుతుంది
రాహుల్ గాంధీ చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు మేము మద్దతిస్తే తప్పేంటి?
జాతీయ పార్టీ కానీ టిఆర్ఎస్ నేతలు ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటించినట్లు?
కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి సీతక్క
రాష్ట్రంలో ఎక్కడికక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, తాను కూడా నిజాంబాద్–కామారెడ్డి జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చినట్టు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క చెప్పారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డిలో గోడ కూలి ఇద్దరు మరణించారని, ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బుధవారం నాడు గాంధీభవన్‌లో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు.
రాహుల్ గాంధీ చేపట్టిన బీహార్ యాత్ర గురించి మాట్లాడిన ఆమె, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆయన పోరాటం చేస్తున్నారని, దానికి మద్దతుగా తాము వెళ్లడం తప్పేం కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై న్యాయ నిపుణులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లి అక్కడి నుంచి బీహార్ వెళ్లిన విషయాన్ని వివరించారు. బీజేపీ ఓటు హక్కును కాలరాస్తోందని, ఇప్పటికే 60 లక్షల ఓట్లను తొలగించిందని, బతికిన వారిని కూడా చనిపోయినవారిగా చూపించిందని, ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్‌ను తప్పు పట్టిందని విమర్శించారు.
జాతీయ పార్టీ కానీ టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ హెలికాప్టర్లో ఇతర రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు లేని తప్పు.. తాము ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తే వస్తుందా అని కేటీఆర్ కు మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ముఖ్యమంత్రి ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటారని, ఫామ్‌హౌస్‌లో కూర్చుని కాలక్షేపం చేయరనీ సీతక్క ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ విమర్శలు చేయకుండా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రాహుల్ గాంధీ పోరాటానికి తాము మద్దతు ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు బాధపడుతున్నాయని ప్రశ్నించారు. బీజేపీకి బీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు ఇస్తోందని, అందుకే బీజేపీ అక్రమాలు బయటపడితే బీఆర్ఎస్ ఎక్కువగా ఆందోళన చెందుతోందని వ్యాఖ్యానించారు. అందుకే రాహుల్ గాంధీ యాత్ర పై టిఆర్ఎస్ ఉలిక్కి పడుతుందని విమర్శించారు.
“మా నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడం మా బాధ్యత. బీఆర్ఎస్ తీరుతో బీజేపీ–బీఆర్ఎస్ ఒకటే అన్న నిజం ప్రజల ముందు మరింత బహిర్గతమవుతోంది” అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.