Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలు చేస్తాం: మంత్రి సీతక్క..!!

*దివ్యాంగుల పెన్షన్ ను రూ.6 వేలు చేస్తాం: మంత్రి సీతక్క..!!*

దివ్యాంగుల క్రీడోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి సీతక్క

గచ్చిబౌలి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినట్టుగా దివ్యాంగులకు పెన్షన్ ను రూ.ఆరు వేలను త్వరలో అందజేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్రస్థాయి దివ్యాంగుల క్రీడోత్సవాలు నిర్వహించారు. మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైకల్యం ఉన్నప్పటికీ ఆత్మస్థైర్యం, బలమైన సంకల్పంతో దివ్యాంగులు క్రీడల్లో ప్రపంచస్థాయిలో పతకాలు సాధించడం నిజంగా చారిత్రక అంశమన్నారు.

వరంగల్ బిడ్డ జీవన్ జీ దీప్తి పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేసిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆమెకు రూ. కోటి నగదు. 500 గజాల స్థలం ఇచ్చామని త్వరలోనే గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని చెప్పారు. దివ్యాంగులకు ప్రకటించిన రూ.ఆరు వేల పెన్షన్ ను వీలైనంత త్వరగా అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వివరించారు. బ్యాక్ లాగ్ పోస్టలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంస్థ చైర్మన్ వీరయ్య, స్ర్తీ శిశు సంక్షేమ, దివ్యాంగుల శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, ఉమెన్ కమిషన్ చైర్మన్ శోభారాణి, క్రీడాకారులు పాల్గొన్నారు. 

భగీరథ నీటి నాణ్యతను వివరించేలా సదస్సులు

హైదరాబాద్, వెలుగు: మిషన్ భగీరథ నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సదస్సులు నిర్వహించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియెట్ లో మంత్రి సీతక్క మిషన్ భగీరథ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా.. ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్లపై ఆధారపడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. 

మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న శుద్ధమైన తాగునీటిపై పల్లెల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆర్వో ప్లాంట్లు, బోరు వాటర్ద్వారా తలెత్తే సమస్యలు ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు విధిగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్స్ చేపట్టాలని కోరారు. రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి నెలల్లో క్రాష్ ప్రోగ్రాం నిర్వహించి డిపార్ట్ మెంట్ అధికారులు, పంచాయతీలను సన్నద్ధం చేయాలని సీతక్క ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్డీ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.

Exit mobile version