రేవంత్ పై మంత్రుల ఫిర్యాదు…?
పదేళ్లు నేనే సీఎం అనే కామెంట్లపై పార్టీలో తీవ్ర ప్రకంపనలు
మీనాక్షిని కలిసి ఆవేదన వెళ్లగక్కిన ఐదుగురు మంత్రులు..!
పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటే మేము భజన చెయ్యాలా.. ?
రాహుల్ అపాయింట్మెంటే లేదు.. రేవంత్ మళ్ళీ సీఎం ఎలా అవుతాడు..?
సొంత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీని బలి పెడితే ఊరుకోమని మండిపాటు
మళ్ళీ రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని స్పష్టీకరణ
మంత్రుల ఫిర్యాదులతో, రేవంత్ రెడ్డికి ఫోన్ లోనే క్లాస్ పీకిన మీనాక్షి
10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇదే వ్యవహారంపై రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా జాతీయ పార్టీల్లో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలన్నా, ముఖ్యమంత్రిని నియమించాలన్నా, తొలిగించాలన్నా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి ఎప్పటి నుండో ఉంది, అలాంటిది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మాత్రం రాబోయే పదేండ్లు తానే సీఎంను అని పదే పదే చెబుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై అసలు కాంగ్రెస్ నేతలు రుసరుసలాడుతున్నారు. ఇలా ఏకపక్షంగా ప్రకటించుకోవడం వెనుక కారణం, ఎవరిని చూసుకొని ఆ ధైర్యం అని ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే, రేవంత్ కామెంట్లు పార్టీలో మంత్రులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ముఖ్యంగా కోమటిరెడ్డి, పొంగులేటి, భట్టి లాంటి వారు వచ్చే సారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తామే సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. ఉన్నపళంగా రేవంత్ రెడ్డి వచ్చి నేనే 10 ఏళ్ళు సీఎం అంటూ హడావుడి చెయ్యడంతో వారికి మింగుడుపడట్లేదు. అందుకే రేవంత్ కేబినెట్ మంత్రులు దాదాపు ఐదుగురు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారు. పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటే మేము భజన చెయ్యాలా ? రాహుల్ అపాయింట్ మెంటే లేదు.. రేవంత్ మళ్ళీ సీఎం ఎలా అవుతాడు? సొంత ఇమేజ్ కోసం కాంగ్రెస్ పార్టీని బలి పెడితే ఊరుకోమని మంత్రులు స్పష్టం చేశారట. మళ్ళీ రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని మీనాక్షికి గట్టిగానే చెప్పినట్లు సమాచారం. దీంతో, మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరీ క్లాస్ పీకినట్లు తెలుస్తుంది. ఇప్పటినుండి అయినా, నోరు అదుపులో పెట్టుకోవాలని గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీఎం పదవి పంచాయతీ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి…