హౌసింగ్ బోర్డు భూముల వేలంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం
ప్రశ్న ఆయుధం జులై22: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి అభివృద్ధి కోసం పైసా ఇవ్వకుండా వేలకోట్ల రూపాయల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలంపై కె.పి.హెచ్. బి కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీసారి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని స్థలాలకు వేలం పాట నిర్వహిస్తూ భూములను అమ్ముకుంటున్నదని ఎద్దేవా చేశారు. 1400 ఎకరాలలో ఏర్పాటైన కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు స్థలంలో 10 శాతం భూమిని ప్రజల వినియోగార్థం కేటాయించటం జరిగిందని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి భూములను సైతం వేలం వేస్తున్నదని, మాస్టర్ ప్లాన్ లో 100 ఫీట్లు రోడ్డు ఉండగా, హౌసింగ్ బోర్డు అధికారులు మాత్రం తమ ప్లాన్ లో 40 ఫీట్లు రోడ్డు చూపిస్తూ మిగిలిన స్థలాన్ని వేలం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూములను వేలం వేసిందని, కానీ ఈ 18 నెలల్లో కూకట్‌పల్లి నియోజకవర్గానికి 18 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హౌసింగ్ బోర్డు స్థలాలను వేలం వేయటం కాకుండా వాటిని పరిరక్షించి వాటిలో పార్కులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఉపయోగ పడేలా చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో సుమారు 5 వేల కోట్ల రూపాయల విలువైన హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయనున్నదని, ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఆ భూములను ప్రజల అవసరం కోసం వినియోగిలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అంతకు ముందు హౌసింగ్ బోర్డులోని విఘ్నేశ్వర ఆలయంకు ఆనుకుని పక్కనే వున్న హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాసరావు, శిరీష బాబురావు, సతీష్ అరోరా, కృష్ణారెడ్డి, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.