Site icon PRASHNA AYUDHAM

ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష – నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని మదన్ మోహన్ ఆదేశాలు

IMG 20251018 WA0136

ఎల్లారెడ్డి, అక్టోబర్ 18, (ప్రశ్న ఆయుధం):

ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలిసి జరుగుతున్న పనుల పురోగతిని వివరంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. రోడ్లు, డ్రైనేజీలు వంటి నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రీ–వర్క్ చేయించి బాధ్యత వహింపజేస్తామని హెచ్చరించారు.

సమావేశంలో మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం, శానిటేషన్ సమస్యలు, పనుల పురోగతి వంటి అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే గారు, సంబంధిత అధికారులను తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని శుభ్రత పనులను సమయానుసారం, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

అదే విధంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులపైనా సమీక్ష జరిపి, ఆలస్యానికి కారణమైన అంశాలను విచారించారు. సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

అన్ని అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోనే నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎమ్మెల్యే మదన్ మోహన్, “ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం” అని స్పష్టం చేశారు.

Exit mobile version