తెలంగాణ సంస్కృతి పై దాడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత.

కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయండి. ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు. తెలంగాణ సంస్కృతి పై దాడి చేస్తున్నారు. నిజామాబాద్ సభలో ఎమ్మెల్సీ కవిత.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 29

తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చే వరకు ఎక్కడికక్కడ నిలదీయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఇందల్వాయి టోల్ గేట్ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ, బోనాలతో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీ జే పీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు సబ్బండవర్గాలను మోసం చేశాయని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక నాపై, రామన్న పై తప్పుడు కేసుల తో కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాది కేసులకు భయపడే రక్తం కాదని, భయపెట్టే రక్తం అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నేను నిజామాబాద్ బిడ్డను కేసులకు భయపడే ప్రసక్తే లేదని , ప్రజల కోసం పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు..

IMG 20241229 WA0073

ప్రజల అండదండలు ఉన్న నిప్పులాంటి మనిషినని మీ ఆశీర్వాదం ఉన్నంతవరకు ఏ కేసు ఏం చేయదన్నారు.తెలంగాణ రాష్ట్రంలో అనేక హామీలతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ విద్యార్థులను, మహిళలను, రైతులను మోసగించిందన్నారు. ఉచిత బస్సు హామీతో బస్సుల సంఖ్యను తగ్గించారన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 అమలు చేయడం లేదని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని మాట తప్పిందన్నారు.ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో వందలాది మంది గురుకులాల విద్యార్థులు చనిపోతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడుగా రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేసి కాంగ్రెస్ మాత విగ్రహం ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ హయంలోని నోటిఫికేషన్ ల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని అన్నారు.హామీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని కవిత స్పష్టం చేశారు. మళ్లీ తెలంగాణరాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన ఉండి పోరాడుతామన్నారు. ఈ బహిరంగ సభలో బీఆర్ఎస్ నాయకులు కే ఆర్ సురేష్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, శిల్ప రాజు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now