సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): పరిశ్రమలలో అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అవగాహనతో పాటు సన్నద్ధతను మరింత పెంపొందించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDRF) సహకారంతో ఈనెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న మాక్ డ్రిల్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై శనివారం సంబంధిత శాఖల అధికారులు, అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్–1 ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాక్ డ్రిల్ ప్రిపేర్‌డ్నెస్ ప్రణాళిక, ఆయా శాఖల బాధ్యతలు, అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే చేపట్టాల్సిన తక్షణ చర్యలు, సమన్వయం, సమాచార వ్యవస్థ, అత్యవసర సేవల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. ఈ మాక్ డ్రిల్‌ను ఈనెల 22న హత్నూర మండలం బోర్పట్ల గ్రామంలో గల అరబిందో ఫార్మా లిమిటెడ్, యూనిట్–వన్ లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమల్లో సంభవించే అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ చర్యలు తీసుకోవాలి, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మాక్ డ్రిల్‌ను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని, అలాగే మాక్ డ్రిల్ నిర్వహణకు అరబిందో ఫార్మా లిమిటెడ్ యాజమాన్యం సహకరించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అధికారులు, అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్–వన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈనెల 22న అరబిందో ఫార్మా లిమిటెడ్ యూనిట్–1లో మాక్ డ్రిల్
Oplus_16908288