సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో పరిశ్రమల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవలసిన రక్షణ చర్యలపై ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, జిల్లా పోలీసు, ఫైర్, రెవెన్యూ మొత్తం 14 శాఖల సమన్వయంతో జిల్లాలోని హత్నూర మండలం బోర్పట్ల గ్రామ శివారులో గల ఎపిటోరియా ఫార్మా యూనిట్-1 ప్రైవేట్ లిమిటెడ్ నందు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవలసిన తక్షణ చర్యలు, సిబ్బంది సురక్షితంగా బయటపడే మార్గాలు, రక్షణ బృందాల సమన్వయం వంటి అంశాలపై జాతీయ విపత్తు నిర్వహణ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందం, అగ్నిమాపక బృందం ద్వారా ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి ఉద్యోగి సేఫ్టీ నియమాలను పాటించడం అత్యంత కీలకం అని, అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ప్రాణనష్టం తగ్గించేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, విపత్కర పరిస్థితులల్లో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనే అంశాలపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ఈ మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, అగ్నిమాపక అధికారి నాగేశ్వరరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, మెడికల్, మొత్తం 14 శాఖలకు చెందిన అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎపిటోరియా ఫార్మా యూనిట్-1 ప్రైవేట్ లిమిటెడ్ లో మాక్ డ్రిల్: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్
Oplus_16908288