అధునాతనం ఈ సనాతనం!

సనాతనం
Headlines
  1. సనాతనం: చరిత్ర మరియు ఆధునికత మధ్య స‌మ‌స్య
  2. ఆధునిక కాలంలో సనాతనవాదం: ఒక విశ్లేషణ
  3. సాంప్రదాయాల ప్రాముఖ్యత: భారతదేశంలో సనాతన విలువలు
  4. సనాతనవాదం పై విమర్శలు: సాంస్కృతిక పరిప్రేక్ష్యం
  5. భవిష్యత్తుకు సనాతనం: మార్పులు మరియు సాధ్యమైన మార్గాలు
 

అధునాతనం ఈ సనాతనం!

ఇప్పటి సంగతి తెలియదు కానీ, ఓ నలభై యాభై ఏళ్ల కిందట చాలామంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ముఖ్యంగా తెలుగు ప్రొఫెసర్లు, సంప్రదాయవాదులుగానే ఉండేవాళ్లు. క్లాసుల్లో పాఠాలు కూడా అట్లాగే చెప్పేవాళ్లు. అటువంటి ఒక తెలుగు ఆచార్యుడు, ఏదో పాఠం చెబుతూ కారల్ మార్క్స్ పేరు ఎత్తుకున్నారు. ఆశ్చర్యకరంగా, ప్రశంసించడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆయన మార్క్స్‌లో కనిపెట్టిన గొప్ప గుణం ఏమిటంటే, నూటాయాభై ఏళ్ల పాతవాడవడం. అంత పూర్వపు కాలంలోనే, అంత గొప్పగా చదువుకుని కొత్త సిద్ధాంతం చెప్పాడు అని మార్క్స్‌ను మెచ్చుకున్నారు. ఆ అధ్యాపకుడి తన్మయం, సిద్ధాంతం గురించి కాదు, మార్క్స్ ప్రాచీనత గురించి

పాతకు ఎప్పుడూ అటువంటి ఫాలోయింగ్ ఉంటుంది. అట్లాగని, ఎప్పుడూ ఒకే ‘పాత’ ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త ‘పాత’ కూడా ఏర్పడుతుంది. హాయిగా ఉండేదనిపించే గతం మీద మనిషికి బెంగగా ఉంటుంది. వర్తమానం మీద విసుగ్గా ఉంటుంది. గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అనాలనిపిస్తుంది. కొత్తొక వింత పాతొక రోత అని వెక్కిరించాలని పిస్తుందిపాతను ప్రేమించాలంటే, గడచిన యుగాల గురించి, చరిత్ర గురించి పెద్దగా తెలియనక్కరలేదు. గతించిపోయిన విలువలు తిరిగి రావాలని ఉంటుంది కానీ, అలనాటి జీవనసరళి యథాతథంగా కావాలని అందరూ కోరుకోరు. ఆధునిక ప్రయాణసాధనాలూ, యంత్ర సదుపాయాలూ లేని కాలంలోకి వెళ్లాలంటే, విశ్వనాథ సత్యనారాయణకు కూడా విముఖతే ఉంటుంది. తంత్రిలో విద్యుత్ ప్రవహింపజేసిన మహాశక్తి ఏది వంటి ఎదురుప్రశ్నలేవో వేశారు కానీ, ఆయన కరెంటును కాదనలేదు.ఛాందసవాదుల్లో అతి కొద్దిమంది మాత్రమే అరచేతులు అడ్డుపెట్టి మార్పును ఆపాలని, గడియారాన్ని వెనక్కు తిప్పాలని గట్టిగా ప్రయత్నం చేస్తారు. అత్యధికులు మాత్రం, గతాన్ని ఒక భావనగా మార్చేసి, ఆరాధిస్తూ, ప్రచారం చేస్తూ, భౌతిక జీవితంలో వర్తమానపు పోకడలోనే వ్యవహరిస్తుంటారు. ఎవరి వల్ల సమాజానికి ఎంత నష్టం, ఎంత లాభం అన్నది ఆసక్తికరమైన చర్చ. కానీ, గతారాధకులందరినీ, ఛాందసులుగా లెక్కగడితే మాత్రం తప్పులో కాలువేసినట్టే. సనాతనవాదం ఈ మధ్య చాలా వార్తలలోకి వచ్చింది. ఈ సనాతనం అంటే నికార్సయిన నిర్వచనం ఏమిటో ఎవరికీ తెలియదు. మార్పులేనిది, నిరంతరమైనది, శాశ్వతమైనది అని అర్థాలున్న ‘సనాతనం’, దేన్ని సూచిస్తున్నదన్న విషయంలో ఒక స్థిరమయిన ఏకాభిప్రాయం ఏర్పడలేదు. కానీ, సనాతనాన్ని విమర్శించేవారు మాత్రం, సనాతనులంటే, గతించిపోయిన చెడుగులను అన్నిటినీ తిరిగి తేవడానికి ప్రయత్నిస్తున్నవారిగా చిత్రిస్తున్నారు. చాతుర్వ్యర్ణ వ్యవస్థను, అంటరానితనాన్ని, సతీసహగమనాన్ని, బాల్యవివాహాలను తిరిగి సమాజంలోకి తేవాలనుకుంటున్నారా అని సనాతనవాదులను ప్రశ్నిస్తున్నారు.సనాతనవాదులకు తామెందుకు సనాతనాన్ని సమర్థిస్తున్నదీ పెద్దగా తెలియదు. భారతదేశంలో హిందూ మతం ప్రాచీనమైనదని, ఆ మతధర్మం సహస్రాబ్దాల పరీక్షకు నిలిచిందని, దానికి ప్రమాదం వస్తే తాము నొచ్చుకుంటామని, ఆగ్రహిస్తామని సనాతనవాదులు చెబుతుంటారు. ఘర్షణాత్మక సంవాద సందర్భాల్లోనే వారికి సనాతనవాదం స్ఫురణకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణ సందర్భాలలో ఎవరూ సనాతనవాదాన్ని బోధించి, ప్రచారం చేయడం పెద్దగా చూడము. ఎందుకంటే, ఏయే అంశాలు సనాతనం అవుతాయో, హిందూమతం కీలకసారాంశం ఏమిటో చెప్పమంటే వారు సరైన సమాధానం ఇవ్వగలగడం కష్టమే. నిజానికి, ఒకే రకమైన సమాధానం ఇంకా రూపొందలేదు. ధర్మం అనే మాట వేదాల్లోనే ఉంది కానీ, ‘సనాతన ధర్మ’ అనే జంట పదాల ప్రయోగం బౌద్ధంలోనే మొదలు. బౌద్ధం ప్రకారం, సత్యమే సనాతనధర్మం. మహాభారతంలో అనేక చోట్ల సనాతన ధర్మం అనే మాటలు కనిపిస్తాయి. సత్యం అనే అర్థంతో పాటు, ఇంకా అనేక సందర్భాలలో వేరు వేరు అర్థాలలో ఆ ప్రయోగం చూడవచ్చు. వేరు వేరు సనాతన ధర్మాలున్నాయన్న ప్రస్తావన కూడా భారతం ఆదిపర్వంలో ఉన్నది.ఏ సాంస్కృతిక జీవనంలో అయినా ఒక అంతస్సూత్రం ఉండవచ్చు. అనేక కాలాల గుండా కొనసాగే ఒక సారాంశ విలువ ఉండవచ్చు. ఆ అర్థంలో సనాతన ధర్మం అనే మాట వాడడంలో తప్పేమీ లేదు. కానీ, చారిత్రకంగా చూసినప్పుడు, ఇప్పుడు హిందూమతంగా పిలుస్తున్నది ఒకనాడు వైదిక ధర్మంగా, అనంతరం అనేక ఆరాధనాశాఖలుగా, భక్తిమార్గాలుగా కొనసాగి, వలసపాలనలో ఏకీకరణ చెందింది. బ్రిటిష్ హయాంలోనే, భారతదేశానికి ఒక ఉమ్మడిగతాన్ని నిర్మించవలసిన అవసరం ఏర్పడింది. ఆ ఉమ్మడి గతాన్ని సనాతన ధర్మం లేదా సనాతన సంస్కృతిగా పిలవడం మొదలయింది. ఈ చారిత్రక ప్రయాణాన్ని పక్కన బెడితే, ప్రస్తుతం సనాతన ధర్మం అనేది సాంస్కృతిక మత జాతీయవాదానికి పునాదిభావనగా పరిణమించింది. ఇతరాన్ని నిర్వచించడం ద్వారా తనను నిర్వచించుకుంటున్నప్పుడు, ఒక తన్మయ, సగర్వ భావం కలిగించగలిగే గతానికి చెంది ఉండడం ఒక అవసరం అవుతుంది. దానికేమీ ప్రత్యేక నిర్వచనాలుండవు. ప్రస్ఫుటంగా కనిపించే భిన్నత్వాన్ని కొనసాగించే ప్రేరణ ఇవ్వడమే ఈ భావన ప్రయోజనం. నిజానికి సనాతనవాదం పేరుతో ఒక సమూహాన్ని ఎవరూ సమీకరించలేదు కానీ, ఒక దశాబ్దంగా భారతదేశంలో ఉన్న ప్రత్యేక సాంస్కృతిక పరిస్థితుల్లో రూపొందిన తీవ్ర జాతీయవాదులను, వారి సానుభూతిపరులనే సనాతనవాదులుగా అంతా పరిగణిస్తున్నారు. ప్రగతిశీలురు, హేతువాదులు పొరబడుతున్నట్టు, ఈ సనాతనవాదులు ఆధునికతకు, ఆధునిక జీవనసరళికి వ్యతిరేకులు కారు. నిజానికి ఈ సనాతన భావనే ఆధునికమైనది. సనాతనవాదులెవరూ తమ పిల్లలను ఆధునికవిద్యకు, విదేశీ ఉద్యోగాలకు ఎడం ఉంచడం లేదు. ఎవరూ సాంప్రదాయిక దుస్తులు మాత్రమే ధరించడం లేదు. ప్రత్యేక సందర్భాలలో తప్ప మతపరమైన చిహ్నాలు ధరించడం లేదు. మొత్తం సమాజంలో ఎంత మేరకు ఉన్నదో వారిలో అంత మాత్రమే కులతత్వం ఉన్నది. అయినా, వారిలో కూడా కులాంతర వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. దురాచారాల సంస్కరణకు వారు విముఖంగా లేరు. ఆధునిక శాస్త్రవిజ్ఞానం వారు కూడా అధ్యయనం చేస్తున్నారు. ఆలోచనల్లో అపసవ్యత, అన్య మతస్థుల విషయంలో అసహనం పాలు ఎక్కువ ఉండవచ్చును కానీ, తక్కిన అన్ని విషయాల్లోనూ వారు సాధారణ ఆధునిక జీవనులే.ఉదయనిధి స్టాలిన్ సనాతనవాదాన్ని నిర్మూలించాలన్నప్పుడు సంచలనం కలిగినమాట నిజమే కానీ, తమిళనాడు క్షేత్రంలో ఆ మాటకు ఉండే అర్థం, ప్రాసంగికత వేరు. బ్రాహ్మణాధిక్యానికి, ద్రావిడ వ్యతిరేకతకు గుర్తుగా సనాతనాన్ని ఉదయనిధి చూశారు. భారతీయ జనతాపార్టీ కానీ, దాని సహచర సాంస్కృతిక సంస్థలు కానీ ఆ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ, సనాతనవాదంలో సమర్థించవలసిన అంశాల గురించి వాదనలు చేయలేదు. ఉదయనిధి వంటి వారి వాదనలు, దాని ప్రతివాదనలు ప్రజలలో భావాల రీత్యా తీవ్ర విభజనను కలిగిస్తాయి, అందులో బీజేపీకి, దాని మిత్రులకు ప్రయోజనం ఉన్నది కనుక, ఆ వివాదాన్ని కొనసాగిస్తూ పోయారు. అంతిమంగా అది భావాల, విలువల పోరాటంగా కంటె, ఒక రాజకీయ పోరాటంగా పరిణమించింది.సనాతనవాదాన్ని వ్యతిరేకించాలనుకునే వివిధ సిద్ధాంతవాదులు ఎవరైనా, ఎదుటివారిని, వారి మొత్తం రాజకీయార్థిక, సాంస్కృతిక వర్తమాన విధానాలకు విమర్శించాలి తప్ప, వారేదో ఆదిమయుగంలోకి సమాజాన్ని నడిపించేవారన్నట్టు వాదనలు నిర్మించడం మానుకోవాలి. సనాతనవాదాన్ని గాఢంగా నమ్మడం, ఆధునిక జీవనంలోని ప్రగతిశీల మార్పులను మందగింపజేయడమో, నిరోధించడమో చేసేమాట నిజమే. మొత్తంగా సామాజిక, రాజకీయ ప్రయాణాన్ని గుణాత్మకంగా ప్రభావితం చేస్తుంది కూడా. అంతేతప్ప, అది తిరిగి అస్పృశ్యతను, రాచరికాన్ని తిరిగి తీసుకురాదు. అంతర్గత సంస్కరణలను కూడా అడ్డగించదు. అయితే, అమెరికాలో రిపబ్లికన్ల వలె ఒకటి రెండు అంశాల్లో సాంప్రదాయికతను ప్రతీకాత్మకంగా బలవంతంగా కొనసాగించవచ్చు. అన్ని రకాల ఆధునిక వ్యవస్థలను, శాస్త్ర ప్రగతిని అనుభవించే రిపబ్లికన్లు గర్భస్రావ హక్కు విషయంలో పట్టింపుగా ఉంటారు, అలాగే, ఇతరుల కంటె ఎక్కువ వర్ణవివక్ష చూపుతారు.ఒక పరంపర నిరంతరాయంగా ఉంది అనుకోవచ్చును కానీ, అది ఏ మార్పూ లేకుండా యథాతథంగా కొనసాగుతూ వచ్చిందని చెప్పలేము. ప్రపంచంలో ఏ మతమూ మార్పులు లేకుండా సాగలేదు. ఏ సమాజమూ విలువలలో మార్పులు చేర్పులు లేకుండా ప్రయాణించలేదు. శాశ్వతమైన విలువ ఏదైనా ఉందంటే అది మార్పు మాత్రమే. ఒక సుస్థిర ప్రాచీన ధర్మం ఉన్నదనీ, దానికి తాము చెంది ఉన్నామని, దానిని కాపాడుకోవాలనీ భావించడం ఒక సాంస్కృతికరాజకీయ అవసరం. వర్తమానంలోని వాస్తవికతకు చెంది ఉండడంలోని అసౌకర్యాన్ని, పరాయితనాన్ని తొలగించగలిగితే, మనిషికి ఈ పారంపరిక అగత్యం ఉండకపోవచ్చు. అంతేకాదు, పరంపర ఏకైకం కాదు. గతం నుంచి కొనసాగింపు ఒకే కోవలో ఉండదు. వర్తమాన ప్రత్యామ్నాయాలు మాట్లాడేవారు, గతంలోని ప్రత్యామ్నాయాలను కూడా అన్వేషించాలి. ఆలింగనం చేసుకోవాలి. అనేక మార్గాల మధ్య స్పర్థ, ఘర్షణ సనాతన చరిత్రలో భాగమే.సనాతనవాదాన్ని రాజకీయంగా, సైద్ధాంతికంగా వ్యతిరేకించాలనుకునేవారు, ఆ పనిని తప్పుడు ప్రాతిపదికల మీద చేయకూడదు. ప్రత్యర్థుల ఆలోచనా విధానాన్ని, రంగం మీదకు వచ్చిన సాంస్కృతిక భావనలను డీకోడ్ చేయడంలో విఫలం కావడం యుద్ధరంగంలో ఒక బలహీనత.

Join WhatsApp

Join Now