ఆర్థికాభివృద్ధిలో మోడీ ప్రభుత్వ వైఫల్యం..

మోడీ ప్రభుత్వ వైఫల్యం

ఆర్థికాభివృద్ధిలో మోడీ ప్రభుత్వ వైఫల్యం..

దేశ ఆర్థిక వ్యవస్థను అగ్రస్థానానికి తీసుకెళతామని మోడీ ప్రభుత్వం మనల్ని ఊహాలోకంలో విహరింపజేస్తుంటే వాస్తవాలు వెక్కిరిస్తున్నాయి. దేశం నుండి జరుగుతున్న ఎగుమతుల పతనంలో ఇది స్పష్టంగా కనిపిస్తున్నది.దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి జరుగుతున్న మేరకు కూడా ఎగుమతుల పెరుగుదల ఉండటం లేదని, బంగ్లాదేశ్‌, వియత్నాం లాంటి దేశాలు మన ఎగుమతి మార్కెట్లను కైవసం చేసుకుంటున్నాయని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గత దశాబ్దంలో భారతదేశ జిడిపి పెరుగుదల ఎక్కువగా ఉన్నప్పటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయని ఆ నివేదికలో చెప్పింది.దేశం నుండి బట్టలు, తోలు వస్తువులు, రెడీమేడ్‌ బట్టలు, చెప్పులు తదితరాల ఎగుమతులు 2002లో 0.9 శాతంగా ఉన్నాయి. 2013 నాటికి 4.5 శాతానికి పెరిగి, 2022 నాటికి 3.5 శాతంకు పడిపోయాయి. ఇందుకు భిన్నంగా 2022లో బంగ్లాదేశ్‌ ఎగుమతులు 5.1 శాతానికి, వియత్నాం ఎగుమతులు 5.9 శాతానికి పెరిగాయి. సరుకుల తయారీ రంగంలో మన దేశాన్ని ప్రపంచానికి కేంద్రంగా మారుస్తానని మోడీ ప్రచారం చేస్తుండగా, మన దేశం చిన్న దేశాలతో కూడా పోటి పడలేక, ఎగుమతి మార్కెట్లను వారికి సమర్పించుకొంటున్నది. ఎగుమతుల రంగంలో మనలను వెనక్కు నెడుతున్న బంగ్లాదేశ్‌, వియత్నాంలు ప్రపంచ ఆర్థిక అభివృద్ధి సూచీలో 35వ స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ జిడిపి 455 బిలియన్‌ డాలర్లు కాగా, వియత్నాం జిడిపి 352 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. 2024లో భారతదేశం 3.95 ట్రిలియన్‌ డాలర్ల జిడిపితో ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. వియత్నాం కన్నా 10 రెట్లు, బంగ్లాదేశ్‌ కన్నా ఏడు రెట్లకు మించి మన ఆర్థిక వ్యవస్థ ఉన్నది. అయినా ఎగుమతులలో వెనుకబడటంతో మన వాణిజ్య లోటు పెరిగిపోతున్నది.సామ్రాజ్యవాదులకు లొంగిపోవటమే మేకిన్‌ ఇండియా.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే మన దేశం తయారీ రంగంలో వెనుకబడటానికి ప్రధాన కారణం. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘మేడిన్‌ ఇండియా’ విధానాన్ని పక్కన పెట్టి, ‘మేకిన్‌ ఇండియా’ నినాదం ఇచ్చారు. మేడిన్‌ ఇండియా అంటే భారతదేశంలోనే సరుకులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. ఇక్కడే సరుకులను తయారు చేయాలి. కాని మేకిన్‌ ఇండియా అంటే సరుకుల తయారీ పరిశ్రమలను దేశంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలను ఏ దేశంలో నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. విడి భాగాలను ఎక్కడైనా తయారు చేసుకోవచ్చు. విడిభాగాలను ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నా, వాటిని మన దేశంలో కూర్చి, ఒక వినియోగ సరుకుగా తయారు చేస్తే అది మనదేశంలో తయారైనట్లుగానే పరిగణిస్తున్నారు. ఇదే మేకిన్‌ ఇండియా. ఇదేమీ మోడీ బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. ప్రపంచ బ్యాంకుకు బుర్రను అప్పగిస్తే వారు సామ్రాజ్యవాదులకు ఉపయోగపడే ఇటువంటి ఆలోచనలను ఎక్కించి, తమ స్వంత ఆలోచనలుగాప్రచారం చేసుకోమని సలహా ఇస్తారు. తమ విధానాలను అధికారంలో ఉన్న నాయకుల సృజనాత్మక ఆలోచనలుగా ప్రపంచబ్యాంకు ప్రచారం చేయిస్తుంది. ఆ విధంగా తమ విధానమైన మేకిన్‌ ఇండియాను మోడీ, బిజెపి చేత ప్రచారం చేయించి, ఇదేదో మోడీ బుర్రలో పుట్టిన సృజనాత్మక ఆలోచనగా ముద్ర వేయటానికి ప్రయత్నించారు. ప్రస్తుతం ఎక్కడైతే కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయో అక్కడికి బహుళజాతి సంస్థలు తమ పరిశ్రమలను తరలిస్తున్నాయి. భారతదేశంలో కార్మికుల వేతనాలు, పన్నులను తగ్గించాలని, మరింత ఎక్కువగా రాయితీలు ఇవ్వమని ప్రపంచబ్యాంకు నివేదికలో పేర్కొన్నది. ప్రపంచబ్యాంకు ప్రతిపాదిత విధానాలు మన తయారీ రంగ పునాదిని దెబ్బ తీస్తాయి. మనల్ని మరింతగా దిగుమతులపై ఆధారపడేలా చేస్తాయి.తయారీ రంగంలో తీసుకోవలసిన చర్యలు..సరుకుల ఉత్పత్తిలో దేశం అగ్రస్థానంలోకి రావటం కోసం మొదటగా దేశంలో కార్మికులు, కర్షకులు, మేధావులు, స్వయం వృత్తులు, ఉపాధులు పొందుతున్న, కష్టజీవులు సృష్టిస్తున్న సంపదను ప్రజలందరికీ పున:పంపిణీ చేయాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచటం కోసం కార్మికుల వేతనాలు, కూలీల కూలి రేట్లు, రైతుల, చేతివృత్తిదారుల ఆదాయాలను పెంచే చర్యలు తీసుకోవాలి. ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగాలన్నింటిని తక్షణమే భర్తీ చేయాలి. ఏ రంగంలోనైనా నెలకు కనీస వేతనం 25 వేల రూపాయలుగా నిర్ణయించాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఉపాధి హామీ చట్టాన్ని మరింత విస్తరింపజేయాలి. డబ్బు లభ్యత, పని రోజులపై ఎటువంటి పరిమితిని విధించరాదు. ఇటువంటి చర్యలు తీసుకొంటే మెజారిటీ ప్రజల ఆదాయం, వారి కొనుగోలు శక్తి పెరుగుతాయి. దేశంలో ఉన్న సరుకులను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఊపు వస్తుంది. కొత్త పరిశ్రమలను నిర్మించాల్సిన అవసరంఏర్పడుతుంది. అపుడు దేశం తయారీ సరుకుల ఉత్పత్తిలో అగ్రగామిగా మారటానికి అవసరమైన పునాది ఏర్పడుతుంది. మన లక్ష్యం మేకిన్‌ ఇండియా కాదు, మేడిన్‌ ఇండియాగా ఉండాలి.మన దేశం స్వతంత్రంగా అభివృద్ధి కావటానికి అవసరమైన విధానాలను పక్కన పెట్టి, ప్రపంచబ్యాంకు, ఐ.ఎం.ఎఫ్‌, సామ్రాజ్యవాద దేశాలు రుద్దుతున్న విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నది. సామ్రాజ్యవాదులపై ఆధారపడి అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, సామాజ్యవాదుల విధానాలు మన లాంటి దేశాల కోసం రూపొందించినవి కాదు. సామ్రాజ్యవాదుల లాభాల కోసం రూపొందించినవి. కాబట్టి మనకు ఉపయోగపడవు.సరుకుల ధరలను తగ్గించటానికి రెండు వాదనలు..ఎగుమతులను పెంచుకోవాలన్న చర్చ జరుగుతున్నది. కార్మికుల శ్రమను మరింతగా దోపిడి చేయటం ద్వారా సరుకుల ధరలను తక్కువగా ఉంచి, మన సరుకులను ప్రపంచ మార్కెట్‌లో నింపాలని కొందరు వాదన చేస్తున్నారు. కార్మికులను దోపిడి చేయటం కోసం వేతనాలను తగ్గించటం, వారికిచ్చే సదు పాయలను రద్దు చేయటం, వారి చేత ఎక్కువ గంటలు పని చేయించటం, పెన్షన్‌ లేకుండా చేయటం, పి.ఎఫ్‌, ఆరోగ్య సదుపాయాలు తదితరాలను కుంచింపజేయాలని వీరు చెబుతున్నారు. ఈ విధంగా చేయటం ద్వారా యజమానులు కార్మికులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆ మేరకు వారు తయారు చేసే సరుకుల ధరలు కూడా తగ్గుతాయి. అయితే ఈ విధంగా చేయటం ద్వారా కోట్లాది మంది కార్మికులు, కష్టజీవుల ఆదాయాలు తగ్గిపోతాయి. వారి జీవన ప్రమాణాలు దిగజారతాయి. కొనుగోలు శక్తి తగ్గుతుంది. దానితో అంతర్గత మార్కెట్‌ కూడా కుంచించుకుపోతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దగ్గరౌతుంది. కార్మికులు, కర్షకులు, కష్టజీవుల ఆదాయాలను తగ్గించటానికి పూనుకున్న ప్రభుత్వం దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకినెడుతుందని అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.కార్మికులు, కర్షకుల ఆదాయాలను తగ్గించకుండా, ఉత్పాదకతను పెంచటం ద్వారా సరుకుల ధరలను తగ్గించటం మంచి ప్రత్యామ్నాయం అవుతుందని మరో వైపున వాదిస్తున్నారు. ఉత్పత్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై కేంద్రీకరించి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా శ్రమ ఉత్పాదకతను పెంచి, సరుకుల ధరలను తగ్గించవచ్చు. ఆ విధంగా చేయటం ద్వారానే చైనా ప్రపంచ సరుకుల తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రజల ఆదాయాలను పెంచటం ద్వారా అంతర్గత మార్కెట్‌ను విస్తరింపజేసుకున్నది. నూతన ఆవిష్కరణలపై కేంద్రీకరించి, అట్టడుగున ఉన్న ఆర్థిక వ్యవస్థను రెండవ స్థానానికి తీసుకొచ్చింది. అనేక రంగాలలో అమెరికాను దాటి ముందుకుపోయింది.ప్రపంచంలో అభివృద్ధిని సాధించిన దేశాలు అన్నీ తమ కాళ్ళపై నిలబడి, తమ దేశాభివృద్ధికి అవసరమైన విధానాలను స్వతంత్రంగా అనుసరించాయి. ఇతర దేశాల నుండి అనుభవాలను తీసుకున్నాయి. అటువంటి దేశాలే ఆర్థికాభివృద్ధిని సాధించాయి. ఇతరదేశాల ఒత్తిడితో విధానాలను రూపొందించిన ఏ దేశం కూడా అభివృద్ధిని సాధించలేదు. కాబట్టి ప్రస్తుతం ప్రపంచబ్యాంకు ఆదేశిత, మోడీ అమలు చేసే విధానాలు మన దేశ అభివృద్ధికి దోహదం చేయటం లేదు. సామ్రాజ్యవాదుల, దేశంలోని పెట్టుబడిదారుల ప్రయోజనాలను మాత్రమే నెరవేరుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఈ విధానాలను తిప్పికొట్టాలి.

Join WhatsApp

Join Now