మోదీ నా మంచి మిత్రుడు.. అద్భుతంగా పనిచేస్తున్నారు: ఈజిప్టు వేదికగా భారత ప్రధానిని పొగిడిన ట్రంప్
ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు
గాజా శాంతి ఒప్పందం తర్వాత ఈజిప్టులో కీలక వ్యాఖ్యలు
ఇటీవలే ఫోన్‌లో మాట్లాడుకున్న ఇద్దరు నేతలు
భారత్‌లో అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ పర్యటన
మోదీకి ట్రంప్ సంతకంతో కూడిన ఫొటో బహుమతి
భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకెంతో మంచి స్నేహితుడని, ఆయన అద్భుతంగా పనిచేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ముగింపు పలుకుతూ కుదిరిన చారిత్రక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన అనంతరం, ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “భారత్ ఒక గొప్ప దేశం, దానికి నా మంచి స్నేహితుడు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన చాలా గొప్పగా పనిచేస్తున్నారు” అని ట్రంప్ అన్నారు.
ఇటీవల ప్రధాని మోదీ, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన కొద్ది రోజులకే ఈ ప్రశంసలు రావడం గమనార్హం. చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందం విజయవంతమైనందుకు గాను ట్రంప్‌కు మోదీ అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని గత వారం ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. తమ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతి గురించి కూడా సమీక్షించినట్టు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకోవడం ఇది రెండోసారి.
ఇదే సమయంలో భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రస్తుతం దేశంలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. శనివారం ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో వారిద్దరూ సమావేశమైనప్పటి ఫొటో ఫ్రేమ్‌ను గోర్ బహుమతిగా అందించారు. ఆ ఫొటోపై “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చాలా గొప్పవారు!” అని ట్రంప్ స్వయంగా సంతకం చేసి రాశారు.
ట్రంప్, మోదీల బలమైన నాయకత్వంలో ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, సాంకేతికత వంటి కీలక రంగాల్లో సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని గోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ మోదీని గొప్ప వ్యక్తిగత మిత్రుడిగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో తమ సంబంధం రానున్న నెలల్లో మరింత బలపడుతుందని గోర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా, ఆయన నియామకం ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు మోదీ బదులిచ్చారు.