జమిలి ఎన్నికల వెనక మోదీ పద్మవ్యూహo..
ఈ ప్రచారానికి సరంజామా సిద్ధం అయ్యింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జమిలి ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించవచ్చునని సూచించింది. నీతి ఆయోగ్ దానిని బలపరిచింది. లా కమిషన్ కూడా సమర్ధించింది. తాజాగా మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలను సిఫార్సు చేసింది. ఇంత మంది చేసిన సిఫార్సుల ఆధారంగా “ఎన్నికల సంస్కరణలకు” పూనుకొంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని , వారు ప్రజాస్వామ్య సంస్కరణలకు , ఒకే దేశం భావనకీ వ్యతిరేకులుగా ప్రచార దాడిని సాగించే వీలుంది.
జమిలి ఎన్నికల నినాదం వెనక వున్న మోదీ దీర్ఘకాలిక వ్యూహాన్ని చర్చించే ముందు ఇప్పటికే ప్రచారంలో వుండి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కొన్ని అంశాల లో వాస్తవాలను పరిశీలిద్దాం .
ఎన్నికల ఖర్చు- వాస్తవాలు
ఈ ఎన్నికల వ్యయం మీద జరుగుతున్న చర్చలో రెండు భాగాలున్నాయి. ఒకటి ఎన్నికలలో పోటీ చేసే రాజకీయ పార్టీలు, వారి అభ్యర్థులు ప్రలోభాలకి, ప్రచారానికి పెట్టే ఖర్చు ఒకే ఎన్నికైనా , జమిలి అయినా ఈ ఖర్చు పెరుగడమే కాని తరగదు.
మరొకటి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ చేసే ఖర్చు.
1. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటికి అవసరమైన సదుపాయాల కల్పన 2. పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి ప్రయాణ ఖర్చులు 3. బాలట్ బాక్స్‌ల తరలింపు, సిబ్బంది ప్రయాణ ఖర్చులు 4. పోలింగ్, ఓటింగ్ కేంద్రాలకు అవసరమైన తాత్కాలిక ఫోను, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 5. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి కొనుగోళ్లు. 6. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి చేసే ఇతర ఖర్చులు.
1952లో తొలి జమిలి ఎన్నికలకు అయిన ఖర్చు 10 కోట్లు మాత్రమే. ప్రతి ఎన్నికకు పెరుగుతున్న ఓటర్లు, ధరవరలు, ఏర్పాట్లకీ అనుగుణంగా ఈ ఖర్చు పెరుగుతూ
2014లో 16వ లోకసభ ఎన్నికలకు ఖర్చు 3,826 కోట్లకు పెరిగింది. 2019 నాటికి ఈ ఖర్చు 6 000 కోట్లకు చేరింది.ఇది 5 సంవత్సరాలకి ఒకసారి పెట్టే ఖర్చు. ప్రస్థుత కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 48 లక్షల కోట్లు . ఒకఏడాదికి ఎన్నికల నిర్వహణకు పెట్టే ఖర్చు కేవలం 1200 కోట్లు మాత్రమే.
ఇక రాష్ట్రాల లో వేరు వేరుగా ఎన్నికలు జరిగినా అదనంగా అయ్యేది మరో 1200 కోట్లు.
అందువల్ల జమిలి ఎన్నికలతో ప్రజల డబ్బు ఆదా అవుతుందన్న వాదన వాస్తవం కాదు.
ఎన్నికల కోడ్ – అభివ ద్ధి
తరచు ఎన్నికల వల్ల ఎన్నికల కోడ్ తో అభివ ద్ధి నిలిచిపోతుందన్నది మరో వాదన. లోకసభ ఎన్నికలప్పుడు దేశమంతటికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుంది. కేంద్రంలో వుండే ఆపద్ధర్మ ప్రభుత్వం కొత్త పధకాలను తీసుకునే అవకాశం ఉండదు. వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగేటప్పుడు ఆ రాష్ట్రాలలో ఇదే స్థితి వుంటుంది. ఇకపోతే మధ్యలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం స్తంభించిపోదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పధకాలు, రాయితీలు ప్రకటించడం మీదే మాత్రమే ఆంక్షలు ఉంటాయి. రోజువారీ పరిపాలన యథాతథంగా కొనసాగుతుంది.గతంలో కొన్ని రాష్ట్రాల ఎన్నికల సమయంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడం కూడాఎన్నికలకోడ్ వల్ల ఆగిపోలేదు.
కేంద్రానికి- రాష్ట్రాలకు మధ్య విభజన
దేశం లోని బహుళత్వాన్ని, వైవిధ్యాన్ని మన రాజ్యాంగ నిర్మాతలు పరిగణనలోకి తీసుకున్నారు. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితాల రూపంలో అధికారాల విభజన చేశారు.
ఎన్నికలలో ప్రజలు తీర్పు చెప్పడానికి ఇవే ప్రాతిపదికలు కావాలి. జాతీయ స్థాయిలో లోకసభకు జరిగే ఎన్నికలలో కేంద్రజాబితాలోని అంశాలపై వివిధ పార్టీల
విధానాలపైనా , శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర జాబితాలోని అంశాలఆధారంగా ప్రజలు తీర్పు చెప్పాల్సి వుంటుంది. అందువల్ల లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం వల్ల ప్రజలు దేనికి తగ్గ తీర్పు దానికి చెప్పే వీలుంటుంది. జమిలి ఎన్నికలు ఈ అధికార విభజనను కలగాపులగం చేస్తుంది.జాతీయ అంశాలు పైచేయి సాధిస్తాయి.
1952 లో రాజ్యాంగం అమలు లోకి రాగానే జరిగిన తొలి ఎన్నికలలో జమిలి తప్పలేదు.జాతీయోద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రాల లో రెండింటా ఆధిపత్యాన్ని పొందింది. ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలు విస్మరించబడ్డాయి.
దీని పర్యవసానంగా 1967 లో అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. అవి నేటికీ ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలకు ప్రతినిధులుగా కొనసాగుతున్నాయి.
గతంలో జమిలి ఎన్నికల ప్రయోగం ఒక జాతీయ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి దారి తీసింది. వివిధ రాష్ట్రాల ప్రజల ,ప్రాంతాల ఆకాంక్షల వైవిధ్యాన్ని తుడిచిపెట్టింది.
గతంలో జమిలి ఎన్నికలు వున్నాయి కదా అని వాదించేవారు దాని పర్యవసానాలను విస్మరిస్తున్నారు.
మోదీ దీర్ఘకాలిక లక్ష్యం లేదా వ్యూహం కేవలం రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ఉద్దేశించబడింది. ఇందులో దేశ ప్రయోజనాలకు తావు వుండదు. ఆర్ధిక విధానాల ఆధారంగా ఎన్నికల్లో విజయాలను సాధించడం మోదీ లక్ష్యం కాదు. మెజారిటీ మతవాదం ఒక్కటే తనను దేశ ప్రజలకు ఏకైక నాయకుణ్ణి చేస్తుందన్న భావనే అయనను నడిపిస్తున్నది. ఇది ఆచరణలో వాస్తవం కావాలంటే దేశంలో భిన్నత్వం అన్న భావన వుండకూడదు. వైవిధ్యం అన్న భావన కనిపించ కూడదు. ఒకే దేశం , ఒకే ప్రజ , ఒకే ఎన్నిక మాటున భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని రూపు మాపాలి. అప్పుడు మాత్రమే మోదీ మెజారిటీ వాదం తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలుగుతుంది. విద్వేష రాజకీయానికి తిరుగులేని విజయాలను సాధించి పెడుతుంది.
జమిలి ఎన్నికలు, డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాలు ఈ లక్ష్యాన్ని చేరడానికి మోదీ ఎంచుకున్న సాధనాలు. ఈ నినాదాలు ప్రాంతీయ పార్టీలను బలహీన పరుస్తాయి . డబుల్ ఇంజన్ సర్కార్లలో అవి జూనియర్ పార్టనర్లుగా మారతాయి.కాలక్రమేణా అంతరించి పోతాయి.
అధ్యక్ష తరహాకు రంగం
దేశంలోని వైవిధ్యాన్ని గమనంలోకి తీసుకుని మన రాజ్యాంగం లోక్ సభకు ఎన్నికైన ప్రజాప్రతినిధులలో మెజారిటీ స్థానాలు పొందిన పార్టీపక్ష నాయకుడు ప్రధాని అయ్యే పార్లమెంటరీ పద్ధతిని స్వీకరించింది. ఈ కారణం గానే అధ్యక్ష తరహా ఎన్నికల పద్ధతిని రాజ్యాంగం పక్కన పెట్టింది.
కాని ఎలాంటి రాజ్యాంగ సవరణ లేకుండానే చాపకింద నీరులా ప్రతి ఎన్నిక లోనూ అధ్యక్ష తరహా పద్ధతి వైపు అడుగులు పడుతున్నాయి. ఎన్నికలకు ముందే మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? మీ ముఖ్య మంత్రి అభ్యర్థి ఎవరు? అన్న సవాళ్ళు ప్రతి సవాళ్ళు ముందు కొస్తున్నాయి.రాజ్యాంగ విరుద్ధమైన ఈ సవాళ్ళనే నిజమైన సమస్య గా పత్రికలు , విశ్లేషకులు చర్చిస్తున్నారు. జమిలి ఎన్నికల తర్వాత మన ముందుకు వచ్చే అంశం అధ్యక్ష తరహా ఎన్నికల పద్ధతి . దీనితో ఒకే దేశం -ఒకే ఎన్నిక – ఒకే నాయకుడు అనే రాజకీయ వృత్తం పూర్తి అవుతుంది. ఇదీ జమిలి ఎన్నికల వెనుక దాగిన మోదీ రాజకీయ పద్మవ్యూహం .
ప్రస్తుతం చర్చ అంతా జమిలి ఎన్నికల పర్యవసానాల మీద కాకుండా దాని
సాధ్యాసాధ్యాల మీద జరుగుతున్నది. రాజ్యాంగ సవరణలకు అవసరమైన సంఖ్యాబలం చుట్టూ తిరుగుతున్నది. మోదీ , షా లకు ఆ లెక్కలు తెలుసు. జమిలి ఎన్నికలనే “ గొప్ప సంస్కరణ” అమలును ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే ఆగిపోయిందని దీని అమలుకు తగిన సంఖ్యాబలాన్ని ఇవ్వాల్సిందిగా 2029 ఎన్నికలకు వారు నినాదంగా చేసుకోవచ్చును. పోతే అమిత్ షా ప్రస్తుత లోక్ సభ కాలంలోనే దీనిని అమలులోకి తెస్తామన్న మాటను తక్కువ అంచనా వెయ్యకూడదు. భయపెట్టో, బుజ్జగించో రాజ్యాంగ సవరణలకు తగిన సంఖ్యా బలాన్ని తెచ్చుకునే ఎత్తులు జిత్తులకు పూనుకోవచ్చును. అదీ కాక పోతే 2027 లేదా 2028 లో లోక్ సభను రద్దుచేసి ఆ సంత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు తర్వాత సంవత్సరం జరగాల్సిన ఎన్ డి ఎ కూటమి రాష్ట్ర ప్రభుత్వాలను ముందస్తు ఎన్నికల కోసం రాజీనామాలు చేయించి ఒక విడత జమిలి ఎన్నికలు నిర్వహిస్తూ దీనిని రాజ్యాంగబద్ధం చెయ్యడానికి తమకు మూడు వంతులకు పైగా మెజారిటీ ఇవ్వాలన్నది ఎన్నికల నినాదం చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు . ఎందుకంటే జమిలి వారి రాజకీయ వ్యూహంలో అత్యంత కీలకమైంది. రాజ్యాంగాన్ని, దేశ రాజకీయాలను మలుపు తిప్పే జమిలి ఎన్నికల వెనక దాగిన పద్మవ్యూహాన్ని ప్రతిపక్షాలు సరైన ప్రతివ్యూహంతో ఎదుర్కొనడానికి సిద్ధం కావాల..