మోదీ, పుతిన్, జిన్‌పింగ్ చెట్టాపట్టాల్! ట్రంప్‌పై అమెరికా మీడియా తీవ్ర విమర్శలు
ఎస్సీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ స్నేహబంధం
అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐక్యతా ప్రదర్శనగా అభివర్ణన
ట్రంప్ దూకుడు వాణిజ్య విధానాలే కారణమంటున్న యూఎస్ మీడియా
భారత్‌పై సుంకాల పెంపు ట్రంప్‌కు ఎదురుదెబ్బ అని విశ్లేషణ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య స్నేహబంధం బలపడుతుండటం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు నేతల ఐక్యతకు, అమెరికా నుంచి భారత్ దూరం కావడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు విధానాలే కారణమని అమెరికా మీడియా విమర్శిస్తోంది. ట్రంప్ సొంత నిర్ణయాలే ఆయనకు ఎదురుదెబ్బగా మారుతున్నాయని అభిప్రాయపడుతోంది.
టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌లు ఎంతో సన్నిహితంగా కనిపించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోలు, వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ చివరి నిమిషంలో పుతిన్ కారులో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనంగా నిలిచింది. ఈ పరిణామాలను అమెరికన్ మీడియా లోతుగా విశ్లేషించింది.
అమెరికా ప్రపంచ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ఈ ముగ్గురు నేతలు ఒక కూటమిగా ఏర్పడుతున్నారనడానికి ఈ నవ్వులే నిదర్శనమని ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఎస్సీఓ సదస్సు ద్వారా అమెరికా నేతృత్వంలోని ప్రపంచానికి ఒక సవాలు విసురుతున్నారని ‘సీఎన్ఎన్’ పేర్కొంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారని, దానికి బదులుగానే వాషింగ్టన్‌కు గట్టి హెచ్చరిక పంపేందుకే మోదీ ఈ సమావేశాలకు హాజరయ్యారని ‘ఫాక్స్ న్యూస్’ విశ్లేషించింది.
ట్రంప్ విధించిన సుంకాలే ఎస్సీఓ సదస్సుకు కొత్త ఊపిరి పోశాయని, ఇది చైనాకు ప్రపంచ దేశాలను ఆకట్టుకునే అవకాశం ఇచ్చిందని యూరేషియా గ్రూప్‌కు చెందిన జెరెమీ చాన్ అభిప్రాయపడ్డారు. “భారత్‌తో ట్రంప్ వైరం ఎదురు తిరగవచ్చు” అనే శీర్షికతో ‘ది వాషింగ్టన్ పోస్ట్’ సంపాదకీయం ప్రచురించింది. ట్రంప్ అసాధారణ విధానాల వల్ల అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ ఐక్యతా ప్రదర్శన నొక్కి చెబుతోందని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది.