Site icon PRASHNA AYUDHAM

23న ఉక్రెయిన్‌కు మోదీ..

23న ఉక్రెయిన్‌కు మోదీ

దేశాన్ని సందర్శించనున్న తొలి భారత ప్రధాని అంతకు ముందు రెండు రోజుల పాటు పోలాండ్‌లో

అక్కడి నుంచి రైలులో కీవ్‌కు ప్రయాణం

యుద్ధభూమిగా మారిన ఉక్రెయిన్‌లో ప్రధాని మోదీ ఈ నెల 23న పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌-రష్యాల మధ్య యుద్ధం మొదలయిన తరువాత భారత ప్రధాని ఆ దేశ పర్యటనకు వెళ్లనుండడం ఇదే తొలిసారి. ఈ పర్యటనకు మరో ప్రాధాన్యం ఉంది. భారత్‌-ఉక్రెయిన్‌ల మధ్య 30 ఏళ్ల క్రితం ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభం కాగా, ఆ దేశ సందర్శనకు వెళ్తున్న తొలి భారత ప్రధాని కూడా మోదీయే కావడం విశేషం. అంతకుముందు ఈ నెల 21, 22 తేదీల్లో పోలాండ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కూడా మరో విశేషాన్ని సంపాదించుకొంది. 45 ఏళ్ల అనంతరం భారత ప్రధాని పోలాండ్‌ సందర్శనకు వెళ్తున్నట్టయింది. పోలాండ్‌ నుంచి ఉక్రెయిన్‌ రాజఽధాని కీవ్‌కు ప్రధాని మోదీ రైలులో వెళ్లనున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి(పశ్చిమ) తన్మయ లాల్‌ మాట్లాడుతూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లోదిమిర్‌ జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారని తెలిపారు. ఇటీవల ఆ ఇద్దరు నాయకులు చర్చలు జరిపారని, దానికి కొనసాగింపుగానే ఈ పర్యటన జరుగుతోందని చెప్పారు. చర్చల ద్వారానే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలకాలన్నది భారత విధానమని తెలిపారు. ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు రానున్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు కూడా ప్రకటన జారీ చేశారు. ద్వైపాక్షిక అంశాలు, బహుళ పక్ష సహకారంపై చర్చలు జరగడంతో పాటు, పలు ఒప్పందాలపై సంతకాలు కూడా ఉంటాయని వివరించారు.

Exit mobile version