మోడీ అర్జెంట్ కేబినెట్ భేటీ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ టైమ్ అర్జెంటుగా కేబినెట్ భేటీ నిర్వహించారు. వాస్తవానికి కేబినెట్ భేటీ అంటే బుధవారం నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం కేబినెట్ మంత్రులతో ప్రధాన మంత్రి చర్చిస్తారు. ఆయన దేశంలో లేకపోయినప్పుడు మాత్రమే వాయిదా పడుతూ ఉంటుంది. ఈ దఫా మాత్రం శుక్రవారం మధ్యాహ్నం అనూహ్యంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులకు స్వయంగా ఫోన్లు చేసిన ప్రధాన మంత్రి మీటింగ్‌కు అర్జెంటుగా రావాలని పిలుపునిచ్చారు.
దీంతో 12 మంది మంత్రులు హుటాహుటిన ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇంత హఠాత్తుగా కేబినెట్ భేటీ నిర్వహించడానికి కారణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన టారిఫ్ బాంబేనని తెలుస్తోంది. గురువారం నుంచే 25 శాతం సుంకాల విధింపు అమల్లోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న చేనేత రంగం సహా బంగారం, వజ్రాల పరిశ్రమలపై ప్రభావం పడనుంది. దీంతో ఆయా అంశాలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి మోడీ కేబినెట్ భేటీ అత్యవసరంగా చేపట్టారు.
వాణిజ్య సంబంధాల్లో పెరిగిన ఉద్రిక్తతలు, దేశ ఆర్థిక ప్రయోజనాల రక్షణ కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై మంత్రులతో ప్రధాన మంత్రి చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఆర్థికవేత్తలు, ప్రతిపక్షాల నుంచి వస్తున్న సూచనలు, విమర్శలపైనా ప్రధాన మంత్రి చర్చించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అమెరికాపై వాణిజ్య యుద్ధానికి దిగితే దేశంలో తలెత్తే పరిస్థితులు, అలాగని అనుకూలంగా వ్యవహరిస్తే వచ్చే ఇబ్బందులను కూడా ప్రధాన మంత్రి చర్చించనున్నారు. మొత్తంగా ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
అమెరికాలో పెంచితే మనపై ప్రభావం ఏల?
టారిఫ్‌ల విషయంలో చాలా మందికి ఉన్న సందేహం ఇది. అమెరికా అధ్యక్షుడు దిగుమతులపై సుంకాలు విధించారు. అంటే భారత్ సహా ట్రంప్ ఏ ఏ దేశాలను టార్గెట్ చేసుకున్నారో ఆయా దేశాలకు చెందిన ఉత్పత్తులు అమెరికాలో దిగితే వాటిపై సుంకాలు వర్తిస్తాయి. అంటే అక్కడి వ్యాపారులు చెల్లించాలి. మరి మనకు ఎఫెక్ట్ ఏంటి? అనేది ధర్మసందేహం. అయితే ఇలా అమెరికా పెంచిన సుంకాలను అక్కడి వ్యాపారులు చెల్లించరు. భారత్ నుంచి ఎగుమతి చేస్తున్న వ్యాపారులే చెల్లించాలి. తద్వారా ఆయా వస్తువుల విలువపై భారీ ప్రభావం పడుతుంది. పైగా అమెరికాలో ఆయా ధరలు పెరుగుతాయి.
దీంతో కొనుగోలు చేసే వారు తగ్గిపోయి మార్కెట్ తగ్గుతుంది. ఉదాహరణకు అమెరికాలో భారత బ్రాండ్ వస్తువులు నిన్న మొన్నటి వరకు 10 రూపాయలకు లభిస్తే టారిఫ్ విధించిన తర్వాత అది దానికి అనుగుణంగా అమెరికాలో ధర పెరుగుతుంది. ఫలితంగా భారత ఉత్పత్తుల వినియోగం తగ్గిపోతుంది. ఇది భారత్ ఎగుమతులను తగ్గించేలా చేస్తుంది. ఇలా రెండు రకాలుగా కూడా టారిఫ్ బాధిత దేశానికి ఇబ్బందులు తలెత్తుతాయి.