Site icon PRASHNA AYUDHAM

నర్సాపూర్ లో ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులు

IMG 20250609 210638

Oplus_0

మెదక్/నర్సాపూర్, జూన్ 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ వాహనదారుల నిర్లక్ష్య వైఖరితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌లో రెడ్ లైట్ పడినప్పటికీ చాలా మంది వాహనదారులు ఆగకుండా ముందుకు వెళ్లడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చౌరస్తా వద్ద రోజూ స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు పెద్ద ఎత్తున తిరుగుతుంటాయి. అయితే ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నాయి. పాదచారులు రోడ్డును దాటేందుకు భయపడే స్థితి నెలకొంది. పోలీస్ శాఖ గట్టిగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసు అధికారులు ట్రాఫిక్ సిబ్బందిని నియమించి, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా స్కూల్ టైమ్స్‌లో ప్రత్యేక ట్రాఫిక్ గార్డులు ఉండాలని, ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, స్లో డౌన్ సూచనలు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. వాహనదారులు తమ బాధ్యతను గుర్తుంచుకొని సిగ్నల్‌కు లోబడే విధంగా క్రమశిక్షణతో వాహనాలు నడిపితేనే సమస్యల నుంచి బయట పడే అవకాశముందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.

Exit mobile version