గురుపూజోత్సవం సందర్భంగా సమాజం జరుగుతున్న అనేక సంఘటనల గురించి తనదైన శైలిలో స్పందించిన ఎంపీ ఈటల. 

10.07.2025

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

గురుపూజోత్సవం సందర్భంగా సమాజం జరుగుతున్న అనేక సంఘటనల గురించి తనదైన శైలిలో స్పందించిన ఎంపీ ఈటల.

మేడ్చల్ అర్బన్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ :

అందరికీ గురుపూజోత్సవ శుభాకాంక్షలు.

భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు,

మన పరంపర ప్రపంచానికి ఆదర్శం.

గురుపూజోత్సవం సందర్భంగా వ్యాస మహర్షిని మనందరం పూజిస్తున్నము.

గురువు లేకుండా శిక్షణ లేదు.

చీకటిని పారద్రోలి వెలుగుని ఇచ్చేవారు గురువు.

జ్ఞానోదయాన్ని కల్పించేవారు గురువు.

గురువు మార్గదర్శకులుగా ఉంటారు.

మనలను ఈ స్థాయిలోకి తీసుకొచ్చిన గురువులను స్మరించుకోవడం.. వారిపట్ల కృతజ్ఞత భావంతో ఉండటం అవసరం.

ఆనాడు ఈ కార్పొరేట్ స్కూల్స్ లేవు.

ఆశ్రమాల్లో చదువులు ఉండేవి.

ఈరోజు గురువు అంటే గౌరవం లేదు.

గురువులకే పంగనామాలు పెట్టేవారు ఉన్నారు.

కలియుగంలో మన సాంప్రదాయాలు మంట కలిసి పోతాయని చాలామంది చెప్తున్నారు.

కలికాలం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి.

అప్పట్లో.. సంపాదకంటే విలువలను గొప్పగా భావించే ఈ సమాజంలో… ఇప్పుడు డబ్బు, ఆస్తులే కేంద్ర బిందువు అయ్యాయి.

వినకూడని కనకూడని సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. వాటిని చూసి ప్రాణం కలుక్కుమంటుంది.

తాగుడికి డబ్బులు ఇవ్వలేదని జన్మనిచ్చిన తల్లిని చంపుతున్నారు.

మందలించిన ఖర్మానికి తండ్రిని చంపే వారిని కూడా చూస్తున్నాము.

కసాయి కొడుకు కసాయి బిడ్డ అనే వార్తలు చూస్తున్నాము.

ఆడపిల్లలు కూడా తండ్రులను చంపుతున్న సంఘటనలు ఈమధ్య కనిపిస్తున్నాయి.

ఇది కలియుగమని బాధపడాలా ? ఆలోచన చేయండి.

గొప్ప సంస్కృతి ఉన్న మనం అసహ్యించుకునే విధంగా మారుతున్నామా ?

ఈ గురు పరంపర, మన సంస్కృతి సాంప్రదాయాలను సమున్నతంగా, సంపూర్ణంగా  నిలుపుకోకపోతే మరింత వికృతచేష్టలతో మానవ జీవితాలు కలంకమయ్యే పద్ధతిలో, అసహ్యించుకునే పద్ధతిలో మారుతుంది.

అందుకే మనం ఎంత బిజీగా ఉన్నా, వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా.. సంపాదన ఎంత ముఖ్యమో, కుటుంబ పోషణ ఎంత ముఖ్యమో అనాదిగా వస్తున్న పరంపరను కాపాడుకోవడంలో విఫలం అయితే మానవ జీవితం కలంకం అవుతుంది. కాబట్టి దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుని బాధ్యతగా భావించాలి.

దీనిని పెంపొందించిందికే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము.

తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మలు ఇంట్లో ఉండటం చాలా అవసరం.

పిల్లలు సెల్ ఫోన్ కి అడిక్ట్ అయి ఎవరైనా ఇంటికి వస్తే నమస్కారం చేసే సంస్కారం కూడా లేకుండా పోయింది.

అప్పట్లో చుట్టాలు వస్తే మూడు నాలుగు రోజులు ఉండేవారు. పెళ్లిళ్ళు 16 రోజులపాటు జరిగేవి.

ఇప్పుడు సొంత వారి పెళ్లిలకు కూడా సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిపోతున్నాం.

మనిషి టెన్షన్ లో ఉంటున్నారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు.

ఈ టెన్షన్ వ్యక్తిగతమైనది కాదు సమాజపరంగా వస్తున్నది.

ఈ సమాజానికి పట్టిన టెన్షన్ వదిలించాలంటే ప్రతి ఒక్కరు స్పందించాలి.

రాజకీయ వ్యవస్థ కూడా దీనికి బాధ్యత వహించాలి.

పవర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ కాకుండా పీపుల్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ ఉండాలి.

మనం ఎన్నుకునే నాయకున్ని ఎవడైతే నాకెందుకులే అనుకోకుండా సమర్థున్ని ఎన్నుకోవాలి.

ఇంజనీర్ ఫెయిల్ అయితే బ్రిడ్జి కూలిపోతుంది కానీ ఒక రాజకీయ నాయకుడు ఫెయిల్ అయితే సమాజం కూలిపోతుంది.

అలాంటి సెన్సిటివిటీ ఉన్నవారు రాజకీయాలకు రావాలి.

రాజకీయ నాయకున్ని సమాజంలో చిన్న చూపు చూడకండి.. రాజకీయ నాయకుడు సమాజాన్ని నడిపే గురువు లాంటివాడు. ఆయన సన్మార్గంలో నడిచినప్పుడు మాత్రమే సమాజం చల్లగా ఉంటుంది. ఆ రాజకీయ నాయకున్ని ఎన్నుకునే విషయంలో కూడా ఎలర్ట్ గా ఉండాలని కోరుతున్నాను.

పెరుగుట విరుగుట కొరకే అంటారు ఈ చెడు ఇంతలా పెరిగింది అంటే ఎప్పుడో ఒకసారి విరుగుతుంది అని నమ్మేవాడిని నేను.

గుర్తుపెట్టుకోండి అన్ని డబ్బుతో ఆస్తులతో అంతస్థలతో రావు..

అధికారం ధనం అపురూపమైనది ఉచ్చిడి వాడి చేతిలో శాశ్వతంగా ఉండవు.

డబ్బు అధికారం శాశ్వతం కావని ప్రతి ఒక్కరు మననం చేసుకోవాలి.

మనిషి ఎంత ఎదిగిన ఒదిగేలా ఉండాలి.

నిన్ను చూసి సమాజం గర్వపడాలి తప్ప అసహ్యించుకునే పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

బాధ్యతగల పౌరులుగా సమాజాన్ని నడిపే వారిగా కర్తవ్యం నిర్వహణలో గొప్పగా పాల్గొనాలని మీ అందరిని పేరుపేరునా కోరుతున్నాము.

భారత్ మాతాకీ జై.

గోపు రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి, అవదేశ్ మిశ్రా, పాండే, కార్పొరేటర్లు మీనా ఉపేందర్ రెడ్డి, నవజీవన్ రెడ్డి, సీనియర్ నాయకులు వీకే మహేష్, నారాయణరెడ్డి, మాణిక్ రెడ్డి, పిట్టల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now