*కీసరలో శ్మశానవాటిక కబ్జా యత్నం పై ముదిరాజ్ సంఘం ఆందోళన*
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం జూలై 16
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కీసర మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులకు చెందిన శ్మశానవాటిక కబ్జాకు గురవుతోందని ముదిరాజ్ సంఘం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.సర్వే నెంబర్ 9లో, సుమారు 100 సంవత్సరాల క్రితం ముదిరాజ్ కులస్తుల కోసం 10 గుంటల స్థలాన్ని శ్మశానవాటికగా కేటాయించారని సంఘ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవల కొన్ని వ్యక్తులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గోరీల తవ్వకాలు – ఆనవాళ్ల మాయం
శ్మశానవాటికలో ఉన్న గోరీలను తవ్వి, అక్కడ బ్లాక్ పరదాలు వేయడం ద్వారా ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి శ్మశానవాటికను రక్షించాలని వారు కోరుతున్నారు.
వ్యక్తిగత వేదన – కన్నీటి కధనం
ఈ క్రమంలో నాయకపు శ్రీనివాస్ అనే యువకుడు భావోద్వేగానికి లోనయ్యాడు. “నాకు ఊహ కూడా రాకముందే నాన్న చనిపోయారు. ఆయన మీద ఉన్న ప్రేమతో అప్పుడప్పుడు గోరీ శుభ్రపరిచి వెళ్తుంటాను. కానీ ఇప్పుడు చూసేసరికి గోరీ కనిపించలేదు. నాన్న జ్ఞాపకాలకే ఇప్పుడు రక్షణ లేకుండా పోయింది” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
జ్ఞాపకాలకు గౌరవం దక్కాలనే విజ్ఞప్తి
ఈ శ్మశానవాటికలో తమ పూర్వీకుల జ్ఞాపకాలు, కష్టాల జాడలు ఉన్నాయని, వాటిని కాపాడడం ప్రభుత్వ, అధికారుల బాధ్యతగా ముదిరాజ్ సంఘం పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
కీసరలో శ్మశానవాటిక కబ్జా యత్నం పై ముదిరాజ్ సంఘం ఆందోళన
by Madda Anil
Published On: July 16, 2025 7:46 pm