Site icon PRASHNA AYUDHAM

మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి డా.అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలి: తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగిజ్జ మురళీ కృష్ణ

IMG 20251218 204355

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా.అల్లాని కిషన్ రావు సేవలను గుర్తిస్తూ, నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జనం బాట – సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పటాన్‌చెరు ప్రజల తరపున కల్వకుంట్ల కవిత సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్‌చెరు అంటే పరిశ్రమలు, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కోసం న్యాయస్థానాల దాకా పోరాడి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జీటీ) తీర్పు ద్వారా పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులు సాధించడంలో దివంగత డా.అల్లాని కిషన్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన నిరంతర పోరాట ఫలితంగానే వందల కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో పటాన్‌చెరు ప్రాంతంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతంలోనే జన్మించిన డా.అల్లాని కిషన్ రావు పదవి, పేరు కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడిన మచ్చలేని నాయకుడని మురళీ కృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఆస్పత్రికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభించడమే కాకుండా, రాబోయే తరాలకు ప్రజల కోసం పోరాడితే మార్పు సాధ్యమనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పటాన్‌చెరు ప్రజల తరపున కల్వకుంట్ల కవిత సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, బస్తెపురం పోచయ్య, మేధావుల ఫోరం నాయకులు రెడ్డిబోయిన భిక్షపతి పాల్గొన్నారు.

Exit mobile version