నా అస్తిత్వం నాపైనే అలిగిందేమో..
అందుకే గడియారం చిన్నముల్లు కదల్లేక
కాలాన్ని నెట్టడానికి కష్టపడుతుండగా
నిశ్శబ్దం నా అంతర్మధనపు గానమైంది
నీ మమకారం కొరకు నీవు నా దానివాని!
నా నిస్సత్తువేదో నిద్రను తిట్టిందేమో…
అందుకే నిద్ర నా కంటిరెప్పల్ని తాకాలేక
నిట్టూర్పుల వేడి విషాదం నిషా నింపగా
తనువు బాధలో భావుకతని వెతుకుతుంది
నీ ఓదార్పు కోసం అది నా కలిమికని!
నా మనసు కు నిజం తెలిసిందేమో…
అందుకే బూటకపు నవ్వుని నటించలేక
ప్రస్తుతాన్ని ప్రక్కన పెట్టి గడిపేస్తున్నా
ఇలా గతం నుండి నేను బయటపడాలని
కాని అది అసాధ్యం అంటుంది నా మనసు!
నా భావాలిప్పుడు అలసినాయేమో…
అందుకే కొత్తగా చెప్పి చేయించుకోలేక నీ
జ్ఞాపకారణ్యంలో నన్ను నేను తట్టినట్లుగా
ధైర్యాన్ని ధీమాతో పెనవేసుకోమంటుంది
నీ జ్ఞాపకాలతో ఎప్పటికైనా నీవు నా దానివే
అని…