“*చైత్యభూమి సందర్శించి నా జీవితం ధన్యమైంది*” — ఆలేరు ఎంఎల్ఏ ఐలయ్య
ప్రశ్న ఆయుధం జనవరి 8
భారత దేశ భాగ్యవిధాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సమాధిఐన చైత్యభూమిని సందర్శించి తన జీవితం ధన్యమైందని ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య పేర్కొన్నారు. మంగళవారం ముంబై దాదర్లో గల ఐతిహాసిక చైత్యభూమిని ప్రత్యేకంగా ఎం.ఎల్.ఏ మరియు ఆయన బృందం సందర్శించారు. సమాధిపై ఐలయ్య పూలమాలలు వేసి, చేతులు జోడించి మనసార నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రాయడానికి చాలా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తానని, వారి ఆశయ సాధనతో దేశ ప్రతిష్టను మరింత పెంచే కృషిలో తనుంటానని “చైత్యభూమి సాక్షి” గా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ కి తెలంగాణ సీనియర్ జర్నలిస్టులైన గొరిగే రమేష్, రాసురి నాగేష్ లకు బహుజన మేధావి మూలనివాసి మాలజీ, కార్మిక నేత చౌవల్ రమేష్ లు నీలి కండువా కప్పి చైత్యభూమికి స్వాగతం పలికారు. ఐతే ఈ మేరకు కురుమ సంఘం ముంబై అధ్యక్షులు గవ్వల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు పుప్పాల సత్తయ్య మాట్లాడుతూ మొన్న తమ జాతి సమ్మేళనం విజయవంతం చేసి, గత 2రోజుల నుంచి శాసనసభ్యులు ఐలయ్య తమ గొల్ల యాదవ కురుమ జాతి ప్రజల స్థితిగతుల అధ్యయన కోసం నగరంలోని అనేక బస్తీలను, అడ్డా (నాకాలను), వాడలను దర్శించారని పత్రిక ప్రతినిధులకు వారు తెలియజేశారు. ఇందులో సంఘం పదాదికారులైన జెట్ట కృష్ణ, కుందే చంద్రయ్య, జూకంటి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.