– టిడిపి నుండి తన్ని తరిమేస్తే… కాంగ్రెస్ లో రాజకీయ బిక్ష పెట్టిన నర్సారెడ్డిని విమర్శించడం సిగ్గుచేటు
– తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నేతలు నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్త
– అవినీతి, అక్రమ దందాపై వారు మాట్లాడo దెయ్యాలు వేదాలు వల్లించినట్లే అనిపిస్తోంది
– విలేకరుల సమావేశంలో గజ్వేల్ కాంగ్రెస్ నేతల ఆగ్రహం
గజ్వేల్ 02 మార్చి 2025 :
నాయిని యాదగిరిని టిడిపి నుండి తన్ని తరిమేస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ బిక్ష పెట్టిన డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను సహించేది లేదని గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, తమ్మలి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, లింగారావు, కిష్టాగౌడ్, మాజీ ఎంపీపీ మోహన్, మెదక్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రవీందర్ గుప్త , సీనియర్ నాయకులు న్యాయవాది సాజిద్ బేగ్ తదితరులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ లబ్ధి, నామినేటెడ్ పదవుల కోసం పాకులాడుతున్న నాయిని యాదగిరి, మద్దూరి మల్లారెడ్డి, శ్రీనివాస్ గుప్త లాంటి వ్యక్తులకు పదవులు కట్టబెట్టిన నర్సారెడ్డిని విమర్శించడం తగదని, వారు గత చరిత్ర గుర్తు చేసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. కనీసం కౌన్సిలర్ గా గెలవని నాయిని యాదగిరి గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సృష్టిస్తూ పక్క పార్టీల వైపు చూస్తుండడంతో ఆయనను పక్కన పెట్టినట్లు స్పష్టం చేశారు. 100 ఎకరాల వంశపారంపర్య ఆస్తులను రాజకీయాల కోసం నర్సారెడ్డి ఖర్చు చేయగా, 10 ఏళ్ల కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వీరు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు. 2014 ఎంపీ ఉప ఎన్నికల సమయంలో ఎన్నికల ఇన్చార్జిగా మాజీ మంత్రి గీతారెడ్డి, ప్రస్తుత సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ వంశి చoద్ రెడ్డి స్వయంగా మద్దూరి మల్లారెడ్డితో మాట్లాడగా, ఆయన చేతులెత్తేసిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలని స్పష్టం చేశారు. నయా పైసకు పనికిరాని అనిల్ రెడ్డి, మనోహరాబాద్ మల్లారెడ్డి, గోపాల్ రావు వంటి వ్యక్తులు మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఆనిపిస్తోందని ఎద్దేవా చేశారు. టిడిపి పార్టీతో అంటగాగిన ఈ నేతలు ప్రస్తుతం పార్టీలో కోవర్టులుగా పనిచేస్తూ చిచ్చు పెడుతున్నట్లు తెలిపారు. 2014 మున్సిపల్ ఎన్నికల్లో నాయిని యాదగిరి ఆడిన రాజకీయ క్రీడ పార్టీని బ్రష్టు పట్టించగా, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎవరిని ఎదగనీయకుండా, అణగద్రొక్కినట్లు చెప్పారు. అంతేగాకుండా పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న డిసిసి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డికి వెన్నుపోటు పొడుస్తూ మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు విమర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో నాయిని యాదగిరి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చినట్లు తెలిపారు. గజ్వేల్ పట్టణంలో పలువురిని బెదిరించి ఆస్తులు కూడబెట్టుకున్న నాయిని యాదగిరి 12వ వార్డు ఉప ఎన్నికల్లో పోటీ చేసి చేతులెత్తేయగా, ఎన్నికల ఖర్చును ఎవరు భరించారో?… గుర్తుకు తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్నట్లు చేస్తున్న దుష్ప్రచారం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎక్కడైనా తాము ప్రమాణానికి సిద్ధమని ప్రకటించారు. కేవలం గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసమే నాయిని యాదగిరి కొత్త నాటకానికి తెర లేపగా, ఓసి కేటగిరిలో ఆయన ఆ పదవిని ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ద్వారా పదవులు పొంది నాయకులుగా చలామణి అవుతున్న పలువురు నేతలు పద్ధతి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాయిని యాదగిరి పార్టీకి తెస్తున్న చెడ్డ పేరు, వెన్నుపోటు రాజకీయాలను ఆధారాలతో పార్టీ అధిష్టానం దృష్టికి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో సుఖేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్, నాయకులు భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, డాక్టర్ వహీద్, సమీర్, జంగం రమేష్ గౌడ్, గుంటుకు శ్రీను, శివారెడ్డి, నీల శ్రీనివాస్, అంజద్, గోపాల్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ యాదగిరి, బాల్ రెడ్డి, కిషన్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అజహర్, డప్పు గణేష్, అండిపూర్ బాల గౌడ్, కొడకొoడ్ల బాలు, తదితరులు పాల్గొన్నారు.