*ఈవీఎం అయినా… బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: నారా లోకేశ్*
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం
టీడీపీ కార్యాలయంలో విజయోత్సవ సభ
హాజరైన మంత్రి నారా లోకేశ్
జగన్ కు కొత్త పేరు పెట్టానని వెల్లడి
ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఘన విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యం అని ఉద్ఘాటించారు.
“9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత విశ్వ విఖ్యాత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిది. 9 నెలల్లో రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమమేంటో చేసి చూపించిన పేదల నాయకుడు, మన ప్రియతమ నాయకుడు మన చంద్రన్న . వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు.
ఈ విజయం ఒక చరిత్ర. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి ఐదుకు ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు గాను ఐదు ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుంది. మండలిలో మన ఎమ్మెల్సీలు పులుల్లా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు నాయకులు కౌన్సిల్ కు రాబోతుండటం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి విజయాన్ని అందించిన గ్రాడ్యుయేట్లకు, గెలుపు కోసం పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, జోనల్ కోఆర్డినేటర్లు, ప్రత్యేకంగా నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు” అంటూ పేర్కొన్నారు.
ఆయనకు కొత్త పేరు పెట్టా… ఆ పేరు ఇదే!
ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదు. ఆయనకు కొత్త పేరు పెట్టా. ఆయన ఒక రోజు ఎమ్మెల్యే. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఒక్క రోజు మాత్రమే వస్తారు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా అసెంబ్లీకి ఒక రోజు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడిగి బెంగుళూరు పారిపోతారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి పెడితే డిపాజిట్ రాదని, అందుకే అభ్యర్థిని నిలిపే దమ్ము, ధైర్యం లేక వెనక్కి వెళ్లారు.
2023 లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పుడు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గేమ్ ఛేంజర్ గా మారాయి. ఆ ఎన్నికలతో రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయింది. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి 8 నెలల ముందే మనం అభ్యర్థులను ప్రకటించుకున్నాం.
పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా రామ్ గోపాల్ రెడ్డి , తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా శ్రీకాంత్ కంచర్ల , ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గా వేపాడ చిరంజీవి రావు .. ఆ రోజు ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల దెబ్బకే వైసీపీకి దిమ్మతిరిగింది. ఆ రోజు నుంచే సీన్ రివర్స్ అయింది.
కట్ చేస్తే 164 సీట్లతో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఓ వైపు మోదీ మేనియా, మరోవైపు బాబు గారి బ్రాండ్, ఇంకోవైపు నాకు అన్న సమానులైన పవనన్న పవర్ దెబ్బకు వైసీపీ దిమ్మతిరిగి దుకాణం బంద్ అయింది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరినీ వదిలిపెట్టం
నేను ఎక్కడికి వెళ్లినా రెడ్ బుక్ గురించి అడుగుతున్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టం. ఆ ప్రక్రియ ప్రారంభం అయింది. అంతేగాని ఎవరినో వదిలిపెడతామనే అనుమానాలు వద్దు.