జాతీయ చేనేత దినోత్సవం: చేనేత వస్త్రాన్ని ధరిద్దాం, నేతన్నకు అండగా నిలుద్దాం
ఆగస్టు 7, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా.
పోగును వస్త్రంగా మలచి, మనిషి మానాన్ని కాపాడేది చేనేత. చేనేత వస్త్రం కేవలం ఒక వస్తువు కాదు, అది మన సంస్కృతికి, సంప్రదాయానికి, కళాత్మకతకు ప్రతీక. మన అస్థిత్వాన్ని, అసలైన గుర్తింపును చాటిచెప్పే చేనేత వస్త్రాలను ధరించడం మనందరి బాధ్యత.
జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఆగస్టు 7న జరుపుకుంటాము. 1905లో ఇదే రోజున స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని ఆనాడు పిలుపునిచ్చారు. ఈ స్ఫూర్తితోనే, మన చేనేత రంగాన్ని, దానిపై ఆధారపడి జీవించే నేతన్నలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
చేనేత కార్మికులు ఎంతో శ్రమించి, తమ కళా నైపుణ్యంతో అందమైన వస్త్రాలను సృష్టిస్తారు. అయితే, నేడు యంత్రాలతో పోటీ పడలేక, ఆధునిక పోకడల కారణంగా చేనేత వృత్తి క్షీణించిపోతోంది. ఈ పరిస్థితిని మార్చడానికి మనం ఒక్క అడుగు వేయాలి. చేనేత వస్త్రాలను ధరించడం ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా, మన సాంప్రదాయ వృత్తిని కాపాడుకున్నవారమవుతాం.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని ధరించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుందాం. మన నేతన్నలకు మరింత ప్రోత్సాహం అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపుదాం. ఇది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదు, నిరంతర ప్రక్రియగా మారాలని ఆశిద్దాం.