బీవీఆర్ఐటీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

నర్సాపూర్, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్‌లోని బి.వి.రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్ఐటీ)లో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె.లక్ష్మీప్రసాద్ హాజరై మాట్లాడుతూ.. నేటి పోటీ యుగంలో గ్రంథాలయాల ప్రాధాన్యత అత్యంత ముఖ్యమని తెలిపారు. డిజిటల్ యుగంలో కూడా పుస్తకాల పఠనం విద్యార్థుల జీవితానికి దారి చూపుతుందని, మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు చదువులోనూ, ఉద్యోగావకాశాల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తారని చెప్పారు. అలాగే మారుతున్న సోషల్ మీడియా ప్రభావం నుండి విద్యార్థులు దూరంగా ఉండి, పఠన సంస్కృతిని పెంపొందించుకోవాలని సూచించారు. కళాశాల గ్రంథాలయంలో జాతీయ – అంతర్జాతీయ స్థాయి పుస్తకాలు, రీసెర్చ్ జర్నల్స్, కాంపిటీటివ్ సెల్, లైబ్రరీ ఆటోమేషన్ తదితర సేవలను ఎల్లప్పుడూ విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ ఏ.మల్లికార్జున మాట్లాడుతూ.. జాతీయ గ్రంథాలయాల ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ రాయుడు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ మధుబాబు, కళాశాల మేనేజర్ బాపిరాజు, టీఎల్ఎన్.సురేష్, ఏవో, గ్రంథాలయ సిబ్బంది కుమారస్వామి, శ్రీవాణి, సత్యనారాయణ, మహేంద్ర, రవినాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now