*పార్వతీపురంలో మే 10న జాతీయ లోక్ అదాలత్*
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేశ్వరావు
పార్వతీపురం, ఏప్రిల్ 15: న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించడానికి, వివాదాలను ముందు దశలోనే పరిష్కరించడానికి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి మరియు మండల న్యాయ సేవా కమిటి అధ్యక్షులు ఎస్ . దామోదర రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి మే 10వ తేదీన మొదటి జాతీయ లోక్ అదాలత్ జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
లోక్ అదాలత్ ద్వారా ప్రజలు పెండింగ్ లో ఉన్న కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చునని సూచించారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడానికి లోక్ అదాలత్ వారదిగా ఉపయోగపడుతుందని అన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేకన్నా కేసులను సామరస్యం పరిష్కరించుకుని రాజీ చేసుకోవడమే ఉత్తమ మార్గమని తెలిపారు.
కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా, కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్ట్ తిరిగి చెల్లిస్తుందన్నారు.
లోక్ అదాలత్ లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క కక్షిదారుడు వినియోగించుకుని లబ్ది పొందాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.