మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు అవసరం
కామారెడ్డిలో 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని – ఇన్స్పైర్ మనక్ ఫెయిర్ ప్రారంభం
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా జనవరి 07:
మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని మరియు ఇన్స్పైర్–మనక్ ప్రదర్శనలను నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అబ్దుల్ కలాం ప్రాంగణం, విద్యానికేతన్ హైస్కూల్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ఎస్‌సీఆర్‌టీఈ డైరెక్టర్ రమేష్, ఆర్జేడీ సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు అతిథులుగా పాల్గొన్నారు.
ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు స్వాగత ఉపన్యాసం చేశారు. గత 15 రోజులుగా 27 కమిటీలతో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని, ప్రతి కమిటీకి గెజిటెడ్ అధికారిని కన్వీనర్‌గా నియమించి నిరంతరం సమీక్షలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రదర్శనలు ప్రదర్శించి, సౌత్ ఇండియా స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.
తదనంతరం జిల్లా సైన్స్ అధికారి సిద్ధరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్ కామారెడ్డిలో జరగడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో స్కై వాచ్ క్లబ్బులు, ఇస్రో పర్యటనలు, ఇన్నోవేషన్లకు ప్రోత్సాహకాలు వంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వీటి ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత పెంపొందించడంలో సైన్స్ ఫెయిర్లు కీలకమని అన్నారు. చిన్న వయసులోనే పరిశోధనాత్మక ఆలోచనలు అలవడితే దేశాభివృద్ధికి బలమైన పునాది పడుతుందని తెలిపారు.
జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ టెక్నాలజీ, హైడ్రోజన్ ఎనర్జీ వంటి నూతన రంగాలపై విద్యార్థులను ప్రోత్సహించేలా బోధన జరగాలన్నారు. ప్రతి విద్యార్థిలో సృజనాత్మకత దాగి ఉందని, దాన్ని వెలికి తీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షించడం ఇందుకు నిదర్శనమన్నారు. మిడ్‌డే మీల్ చార్జీలు 40 శాతం, కాస్మెటిక్స్ చార్జీలు 200 శాతం పెంచడం విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపిస్తోందని చెప్పారు.
తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లను ఎస్జీఎఫ్ నిధుల నుంచి కేటాయించామని, వచ్చే విద్యా సంవత్సరానికల్లా బాలుర ఉన్నత పాఠశాల కొత్త ప్రాంగణంలోకి మారనుందని వెల్లడించారు. అలాగే మాచారెడ్డి మండలం విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమని తెలిపారు.
రాబోయే రోజుల్లో విద్యాశాఖ చేపట్టే ప్రతి కార్యక్రమానికి తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.