కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నెలలు నిండక ముందే జన్మించిన ఓ మగ శిశువు ప్రాణాలను అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. శిశువుకు మార్గమధ్యంలో కృత్రిమ శ్వాస అందిస్తూ నిజామాబాద్ ఆస్పత్రికి సురక్షితంగా తరలించారు.
పల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన గీద మానస తన మూడవ కాన్పులో నెలలు నిండక ముందే మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే శిశువు పుట్టిన వెంటనే నిర్జీవ స్థితిలో ఉండటంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. బరువు కూడా చాలా తక్కువగా ఉండి, ఏడవకపోవడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు.
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చిన్నారుల వైద్యుడు శిశువును సాధారణ స్థితికి తీసుకురావడానికి విశేషంగా ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మేర మెరుగుదల కనిపించలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు.
ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) కృష్ణ స్వామి అప్రమత్తంగా వ్యవహరించారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వరకు ప్రయాణం మొత్తం శిశువుకు ఆక్సిజన్ అందించడంతో పాటు అంబు బ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. అలాగే ఐవీ ద్రావణాలు అందిస్తూ శిశువు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
శిశువు ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సిబ్బంది చూపిన చొరవపై శిశువు తండ్రి సంతోష్ హర్షం వ్యక్తం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో EMT కృష్ణ స్వామి, పైలట్ సుదర్శన్ గౌడ్ కీలక పాత్ర పోషించారు. అనంతరం శిశువును సురక్షితంగా ఇంక్యుబేటర్‌లో ఉంచి నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.











