బేగం బజార్ లో మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన రౌడీ షీటర్ ను తన ఆటోతో ఢీకొట్టి అడ్డుకున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ సన్మానించారు. ఈ ఘటన మార్చి 4న చోటుచేసుకుంది.
మార్చి 4వ తేదీ తెల్లవారుజామున బేగం బజార్ లో జరిగిన ఈ ఘటనలో, రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్, మార్నింగ్ వాక్ చేస్తున్న శ్రీమతి మంజు ఓమ్లతా మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నిందితుడి స్కూటీ అదుపుతప్పి కిందపడింది. బాధితురాలి కేకలు విని, అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ వెంటనే స్పందించారు.
పారిపోవడానికి ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్ ను జాహెర్ తన ఆటోతో ఢీకొట్టి కిందపడేశారు. నిందితుడు కర్రతో దాడి చేసినా, జాహెర్ భయపడకుండా అతడిని అడ్డుకున్నారు. గస్తీ తిరుగుతున్న పోలీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా జాహెర్ అక్కడి నుండి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, గోషామహల్ పోలీసులు ఆటో డ్రైవర్ జాహెర్ ను గుర్తించారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, బంజారాహిల్స్ లోని తన ఛాంబర్ లో జాహెర్ ను ప్రత్యేకంగా సన్మానించి, ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. జాహెర్ ధైర్యం, నిస్వార్థ సేవ సమాజానికి ఆదర్శమని సీపీ కొనియాడారు.
డబీర్ పూరకు చెందిన రౌడీ షీటర్ పై గోషామహల్ పీఎస్ లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16 కేసులున్నాయి. నేరం జరుగుతున్నప్పుడు భయపడకుండా, ధైర్యంతో స్పందించి పోలీసులకు సమాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా సీపీ పిలుపునిచ్చారు.












