తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట' కార్యక్రమంలో భాగంగా, బాల్కొండలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ సభను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడం, విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ, బడిబాట అనేది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచడానికి, విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ అని తెలిపారు. గ్రామంలోని బడి ఈడు గల ప్రతి చిన్నారిని, డ్రాప్-అవుట్లను, అంగన్వాడీల్లో 5 ఏళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు, అంగన్వాడీ టీచర్లకు, ఐకెపి మహిళా సమాఖ్యలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
నాణ్యమైన విద్యతో పాటు, అధునాతన సాంకేతిక పద్ధతులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక సదుపాయాలు, రోబోటిక్స్, వృత్తి విద్య కోర్సులు, ఐఐటీ మద్రాస్ సమన్వయంతో సర్టిఫికెట్ కోర్సులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకాల వంటి ప్రభుత్వ ప్రయోజనాలపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, మహిళా సంఘాల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు.
గ్రామ సభలో భాగంగా, ఇంటింటి సర్వే ద్వారా బడికి వెళ్లని పిల్లలను గుర్తించడం, నమోదు ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రణాళికలు రూపొందించడం, వలస కుటుంబాల పిల్లల విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, 'ప్రతి చిన్నారి బడిలోకి' అనే నినాదంతో ర్యాలీలు, తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు. ఈ బడిబాట కార్యక్రమం ద్వారా గ్రామంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలు జరిగేలా చూడటమే గ్రామసభ ముఖ్య లక్ష్యమని తెలిపారు.











