బాల్కొండ మండల కేంద్రంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని, దీనిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తాచెదారం రోడ్లపైకి వస్తుండటంతో పాటు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మండల కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ కార్యాలయం ఎదురుగా, శివాజీ చౌక్ లోని చెత్తకుండీలు నిండిపోయి, చెత్త రోడ్లపైకి చేరుతోంది. ప్లాస్టిక్ కవర్లు, గోనె సంచులు పేరుకుపోవడంతో పాటు, చెత్త నుండి వెలువడుతున్న దుర్వాసనతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.
ఈ పరిస్థితికి పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో అనేక చోట్ల చెత్త పేరుకుపోయిందని, పారిశుద్ధ్య కార్మికులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని వారు పేర్కొన్నారు. ఇది ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలు వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని బాల్కొండను పరిశుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే నిరసనలు తప్పవని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.











