కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసులో పోక్సో చట్టం వర్తించదని, బాధితురాలు మైనర్ కాదని నిందితుడి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదించారు. భగీరథ్ కు మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిందితుడి తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, బాధితురాలు మైనర్ కాదని, అందువల్ల పోక్సో చట్టం ఈ కేసులో వర్తించదని వాదించారు. బాధితురాలికి రెండు వేర్వేరు పుట్టిన తేదీలతో కూడిన సర్టిఫికేట్లున్నాయని, ఒక సర్టిఫికేట్ ప్రకారం ఆమె మేజర్ అని కోర్టుకు వివరించారు.
భగీరథ్ నిర్దోషి అని నిరూపించడానికి తమ వద్ద మరిన్ని ఆధారాలున్నాయని, వాటిని సీల్డ్ కవర్లో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని న్యాయవాది తెలిపారు. ఈ కేసును మిగతా కేసుల్లా చూడరాదని, తన తండ్రి కేంద్ర మంత్రిగా ఉన్నందున పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పోస్టర్లు, సోషల్ మీడియా ద్వారా భగీరథ్ ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
పోలీసులు విచారణ చేయకముందే మీడియా ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదని న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, బండి భగీరథ్ కు మధ్యంతర రక్షణ కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మధ్యంతర రక్షణ లభిస్తే, పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని, వద్దనున్న సాక్ష్యాలను సమర్పిస్తామని హామీ ఇచ్చారు.
మధ్యంతర రక్షణ ఇవ్వకపోతే, ముందస్తు బెయిల్ కూడా అర్థరహితం అవుతుందని, భగీరథ్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశం కోల్పోతాడని న్యాయవాది అన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. మరోవైపు, ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది.











