హైదరాబాద్ లో భార్యకు ఉద్యోగం రావడం, ఆ తర్వాత తలెత్తిన విభేదాల నేపథ్యంలో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. రామకృష్ణాపూర్ కు చెందిన నాగెల్లి శ్రీనివాస్ (41) నేరేడ్మెట్ లోని తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నాగెల్లి శ్రీనివాస్ (41) హైదరాబాద్ నేరేడ్మెట్ లోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్ భార్య సట్ల జ్యోతి గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం పొందారు.
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, జ్యోతికి నిర్మల్లో పోస్టింగ్ రావడంతో భర్తతో దూరం పెరిగిందని, కాపురం చేయడానికి నిరాకరించిందని తెలిపారు. ఇటీవల జ్యోతి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది, హైదరాబాద్ లో కోటి రూపాయల విలువైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ ఇంటి కొనుగోలులో శ్రీనివాస్ రూ.40 లక్షలు ఇవ్వగా, మిగిలిన మొత్తాన్ని జ్యోతి లోన్ తీసుకుని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిసింది.
ఇదిలా ఉండగా, భర్తకు తెలియకుండా జ్యోతి తన తోటి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆనంద్ కు రూ.4 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు అగ్రిమెంట్ పత్రం శ్రీనివాస్ కు లభించింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

