రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సజావుగా కొనసాగాలని, ధాన్యం రవాణాలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, టార్పాలిన్లు, క్లీనింగ్ మెషీన్లు తదితర సామగ్రి సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు.
హమాలీల సమస్యలు తలెత్తకుండా గుత్తేదారులు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. జిల్లాల లక్ష్యాలకు అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, సమస్యాత్మక కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద గ్రామస్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కొనుగోలు ప్రక్రియ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోదాములు అందుబాటులో లేని ప్రాంతాల్లో తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, రైతు బజార్లలో నిల్వ ఏర్పాట్లు చేయాలని సూచించారు. లారీలు లేని చోట ట్రాక్టర్లు, ఇతర రవాణా వాహనాలను వినియోగించి ధాన్యం రవాణా చేపట్టాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రైతులకు తగిన సూచనలు అందించాలని, కొనుగోలు ప్రక్రియపై ప్రతికూల వార్తలు వెలువడితే జిల్లా కలెక్టర్ల పేరుతో వెంటనే రిజాయిండర్లు విడుదల చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాల ద్వారానే జరగాలని, నేరుగా మిల్లులకు తరలించవద్దని మిల్లర్లకు స్పష్టం చేయాలని తెలిపారు. టోకెన్ వ్యవస్థ, రసీదు విధానం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న TAB ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని, రైతులకు MSP చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని PPCల వద్ద సరిపడా వాహనాలు అందుబాటులో ఉంచి ధాన్యం లిఫ్టింగ్, రవాణా వేగవంతం చేయాలని, మిల్లర్లతో సమన్వయం చేసుకుని వాహనాలు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.








