తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ నెలాఖరులోగా రూ.15వేల కోట్లతో మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. శాసన మండలిలో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న 75 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని మరింత విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.
మెట్రో ప్రాజెక్టు నుంచి ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకుందని, గత పదేళ్ల నిర్లక్ష్యం కారణంగానే మెట్రో అభివృద్ధి దేశంలో 12వ స్థానానికి పడిపోయిందని సీఎం విమర్శించారు. మెట్రో విస్తరణతో పాటు, 33వేల ఎకరాల్లో ఒక కొత్త నగరాన్ని నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
అభివృద్ధిని కేవలం నగరానికే పరిమితం చేయకుండా, సమగ్రంగా చేపడతామని, తమది స్మార్ట్ గవర్నెన్స్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలో పాదచారుల మార్గాలపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని, చిరు వ్యాపారుల కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో, జూన్, జులై నెలల్లోగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజల రాకపోకలను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.











