తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు గురించి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి సుమారు రూ. లక్ష వరకు ఖర్చు అవుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో ఇది కేవలం రూ. 25 వేల వరకు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేలకు పైగా నియామకాలు చేపట్టినట్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన చెప్పారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వంటి సంఘటనలు జరిగాయని, కానీ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రంలో మొత్తం 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 36.7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని సీఎం గణాంకాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపైనే ప్రభుత్వం అధికంగా ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యాశాఖ కీలక పాత్ర పోషించాలని, గతంలో ఈ శాఖ నిర్లక్ష్యానికి గురైందని సీఎం అభిప్రాయపడ్డారు. విద్యాశాఖను ప్రక్షాళన చేసి, ప్రభుత్వ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, విద్యాశాఖకు రూ. 21,650 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.











