తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద తొలివిడత నిధులను విడుదల చేశారు. ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,600 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద తొలివిడత నిధులను విడుదల చేశారు. ఎకరం వరకు భూమి ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,600 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులు ఆదివారం కావడంతో సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగిలిన రూ.5,400 కోట్లను మరో 20 రోజుల చొప్పున రెండు విడతలుగా, ఒక్కో విడతలో రూ.2,700 కోట్లు చొప్పున విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సీఎం ఈ ప్రకటన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వంతో పోలిస్తే రైతు భరోసా నిధులను పెంచామని స్పష్టం చేశారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ప్రతి నెలా రైతుల సంక్షేమం కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని, గత 20 నెలల్లో రైతుల కోసమే రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పంట సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, రూ.750 కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించామని, 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ పండించినా కొనుగోలు చేస్తామని తెలిపారు.
కొడంగల్లో కూడా పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని వెల్లడించారు. రైతుల ఆదాయం పెరగాలంటే వరి ఒక్కటే మార్గం కాదని, పంటల మార్పిడికి కృషి చేయాలని సూచించారు. మిల్లెట్స్, ఆకు కూరలు, పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నామని, మహిళలతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.











