రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం, పలు స్టేడియాలను ఆధునీకరించడంపై ఆయన విస్తృత సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్రీడాశాఖ సమీక్షలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడా సౌకర్యాల కల్పన, మైదానాల అభివృద్ధిపై చర్చ జరిగింది.
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. క్రీడాకారుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
గచ్చిబౌలి ఔట్ డోర్ స్టేడియంను పునరుద్ధరించడంతో పాటు, దాని ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా, అలాగే ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు తమ సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియంలను కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునీకరించాలని ఆదేశించారు.

