జిల్లాలోని వసతి గృహ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ములకలపల్లి మండలంలో పర్యటించిన కలెక్టర్, ములకలపల్లి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత వంటి అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై ప్రత్యేకంగా ఆరా తీసిన కలెక్టర్, ఇంటర్మీడియట్ విద్యార్థులతో వారి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించారు. పదవ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా పరిశీలించి, వారికి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. సాయంత్రం స్టడీ అవర్లో స్నాక్స్ అందించాలని ఆదేశించారు.
తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్.ఓ నీటి శుద్ధి కేంద్రాన్ని తనిఖీ చేసి, తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించాలని, వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులందరి బాధ్యత అని కలెక్టర్ నొక్కి చెప్పారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమర్థంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

