రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా, సోమవారం కలెక్టర్ చాంబర్లో ‘రహ్-వీర్’ మరియు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రమాదాలు సంభవించిన సమయంలో క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు.
ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ప్రభుత్వం ‘రహ్-వీర్’ పథకం కింద రూ.25,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందజేస్తుందని తెలిపారు. క్షతగాత్రులకు సహాయం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అపోహలను ప్రజలు విడనాడాలని, సమయానికి అందించే సహాయం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని ఆమె అన్నారు.
జిల్లాలో ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాధికారి అరుణతో పాటు రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












