సంగారెడ్డి జిల్లాలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరచడానికి వైద్యులు, వైద్య సిబ్బంది క్రమశిక్షణ, చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్షలో భాగంగా, ఆసుపత్రుల నిర్వహణపై పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగించాలని, ప్రతి విభాగంలో సేవల నాణ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలపై నిరంతరంగా పరిశీలన జరగాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్‌కు కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో గుర్తించిన క్యాన్సర్ రోగుల వివరాలు సమగ్రంగా అందుబాటులో ఉంచాలని, ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్‌తో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరపాలని సూచించారు. క్యాన్సర్ డే కేర్ సెంటర్లో అందుబాటులో ఉన్న సదుపాయాలపై వారికి పూర్తి అవగాహన కల్పించి, అందరూ చికిత్స పొందేలా చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో ఎస్పీఎం విద్యార్థులకు బాధ్యతలు అప్పగించాలని తెలిపారు.
జెరియాట్రిక్ వార్డును ఆకర్షణీయమైన థీమ్‌తో పెయింటింగ్ చేయాలని, పాత బెడ్స్‌ను మార్చి కొత్తవాటిని ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అవుట్‌పేషెంట్ సేవలను (OPలు) సమర్థవంతంగా స్ట్రీమ్‌లైన్ చేయాలని, రోగుల కోసం క్యూ లైన్లు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోగులు ఇబ్బందులు పడకుండా సులభంగా సేవలు పొందేలా వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.
ప్రతి రోగికి సంబంధించిన పూర్తి వైద్య వివరాలు సమగ్రంగా నమోదు చేసే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలుపై కూడా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇది భవిష్యత్తులో మెరుగైన చికిత్స అందించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంత్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శశాంక, డాక్టర్ కవిత, వివిధ విభాగాల డాక్టర్లు, టీజీ ఆన్లైన్ బృందం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












