ఇబ్రహీంపట్నం సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ వాహనం నడుపుతూ బారికేడ్లను ఢీకొట్టడంతో, అడ్డుకున్న యువకుడితో వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే మద్యం మత్తులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై స్థానికులు, ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలం సమీపంలోని జాతీయ రహదారిపై మద్యం మత్తులో ఉన్న ఓ కానిస్టేబుల్ బైక్ నడుపుతూ రోడ్డుపై ఉన్న వేగ నియంత్రణ బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఒక యువకుడు వెంటనే స్పందించి, కానిస్టేబుల్ వాహనాన్ని అడ్డుకున్నాడు. కానిస్టేబుల్ తీవ్రమైన మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన యువకుడు, 'సమాజాన్ని బాగు చేయాల్సిన పోలీసులే ఇలా తాగి తందనాలాడితే ఎలా?' అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
యువకుడు, 'యూనిఫాంలో ఉండి ఇలాంటి పనులేంటని' ప్రశ్నించడంతో అక్కడ ఉత్కంఠ నెలకొంది. సదరు కానిస్టేబుల్ మద్యం సేవించాడని గట్టిగా ఆరోపించిన యువకుడు, ఆయనకు వెంటనే బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించాలని పట్టుబట్టాడు. చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలని డిమాండ్ చేశాడు.
ఈ తతంగమంతా వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉన్నతాధికారులు స్పందించి సదరు కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన వారే ఇలా ప్రవర్తించడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.











