సిద్దిపేట జిల్లా, జగదేవపూర్ మండలంలోని జంగం రెడ్డిపల్లి గ్రామంలో దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ పై చెప్పుతో దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వివిధ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ దాడి గ్రామంలో రాజకీయ, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసింది.
పంచాయతీ చర్చలకు పిలిచి, కులం పేరుతో దూషిస్తూ అగ్రవర్ణాలకు చెందిన కొందరు వ్యక్తులు దళిత మాజీ సర్పంచ్ దుబ్బాక కుమార్ మరియు ఆయన బంధువులపై చెప్పులతో దాడి చేసి కొట్టినట్లు సంఘటనలో పేర్కొన్నారు. గ్రామంలో అధికంగా ఉన్న ముదిరాజ్ కులానికి చెందిన కొందరు వ్యక్తులు, దళిత మాజీ సర్పంచ్ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుండటం నచ్చక ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం.
గ్రామ పెద్దల సమక్షంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. బాధితులు జగదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మాదిగ జర్నలిస్టు ఫోరం, మాల మహానాడు, కెవిపిఎస్ వంటి దళిత సంఘాల నాయకులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండించారు. దళితులు రాజకీయంగా ఎదగడాన్ని ఓర్వలేక దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, పోలీసుల నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించాలని కోరారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, సీపీ గ్రామాన్ని సందర్శించి, పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని కూడా వారు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.










