మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దేవరయాంజాల్లో ప్రజా ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.
కీసర సర్కిల్, శామీర్పేట్ 300వ డివిజన్ దేవరయాంజాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో, ముఖ్య అతిథిగా విచ్చేసిన భీమిడి జైపాల్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారులు మామిడ్ల అశోక్ దంపతులు సుమారు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న నూతన గృహాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వేద మంత్రాల నడుమ జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని నాయకులు పేర్కొన్నారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం, ఆత్మగౌరవానికి ప్రతీక అని, ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు స్థిరమైన గృహ వసతి కల్పిస్తూ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిదారులు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించే వరకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.











