రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే సరఫరా చేయాలని, కృత్రిమ కొరత సృష్టించడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి ఎరువులు, విత్తనాల సన్నద్ధతపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశం ఐడిఓసి కార్యాలయంలో జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 6,59,743 ఎకరాల్లో సాగు కొనసాగుతుందని, ఇందులో పత్తి, మొక్కజొన్న, వరి ప్రధాన పంటలని తెలిపారు. గత సంవత్సరం అధిక దిగుబడులు సాధించామని, ఈ వానాకాలంలో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి లక్ష్యంగా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ప్రతి డీలర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గుర్తింపు పొందిన సంస్థల నుంచే విత్తనాలు, ఎరువులను సేకరించి ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు పారదర్శకంగా విక్రయాలు జరపాలని సూచించారు.
ఎరువుల నిల్వలు, సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, జిల్లా, మండల స్థాయి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, విత్తనాలు, ఎరువుల సరఫరా సున్నితమైన అంశమని, డీలర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించి కొరత రాకుండా చూడాలని సూచించారు. జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే అవకాశాలున్నాయని, తక్కువ ధరకు లభిస్తాయని నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితులు ఉండవచ్చని, అలాంటి ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పదంగా విత్తనాలు లేదా ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లయితే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. గత సంవత్సరంలో జిల్లాలో ఐదు నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయని, ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సంబంధిత అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.











