12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి ఒంగోలు POCSO కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.7,000/- జరిమానా విధించింది. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
కొండేపి మండలంకు చెందిన నిందితుడు, తన కుమార్తెపై అక్టోబర్ 19, 2025న అత్యాచారం చేశాడు. ఈ సంఘటన తర్వాత, బాలిక తన తల్లికి విషయం చెప్పడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
గౌరవ POCSO కోర్టు జడ్జి శ్రీ కె.శైలజ గారు, సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి, నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాధితురాలికి మూడు లక్షల రూపాయల పరిహారాన్ని DLSA ద్వారా అందజేయాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, పిల్లల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు.
ఈ తీర్పు, పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని, చట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టదని ఎస్పీ పేర్కొన్నారు.











