ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉత్నూర్ లో నిర్వహించిన హిందూ సమ్మేళనం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని, ఆధునికతను ఆహ్వానిస్తూనే మూలాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరయ్యారు.
ఉత్నూర్ వాణి విద్యాలయంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు సద్గురు సోమయ్యప్ప స్వామి హాజరయ్యారు. సనాతన ధర్మం కేవలం మతమే కాదని, అది జీవన విధానమని, సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడినదని ఆయన వివరించారు. కుటుంబ వ్యవస్థ, గురు-శిష్య పరంపర, పండుగలు, ఆచారాలు సమాజాన్ని బలంగా నిలబెట్టే మూలాధారాలని పేర్కొన్నారు.
యువత తమ సంస్కృతి, సంప్రదాయాలను ఆచరించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత తీసుకోవాలని, 'ఎంత ఎదిగినా మన మూలాలను మరవకూడదు. ఆధునిక ప్రపంచంలో ముందుకు సాగుతూ మన సంస్కృతిని కాపాడటం యువత కర్తవ్యం' అని సద్గురు సోమయ్యప్ప స్వామి సూచించారు. గ్రామాలు, బస్తీల్లో జరిగే ఇలాంటి సమ్మేళనాలు సమాజ ఐక్యతను మరింత బలపరుస్తాయని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా దేశవ్యాప్తంగా లక్షకు పైగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని, కుల, వర్గ భేదాలను తొలగించి సమాజాన్ని ఏకం చేయడం ప్రధాన లక్ష్యమని వక్త ఉల్లెంగుల ముత్యం ఇందూర్ విభాగ్ కళాశాల ప్రముఖులు తెలిపారు. పంచపరివర్తన్ సూత్రాల ద్వారా సామాజిక సమరసత, కుటుంబ విలువలు, పౌర బాధ్యతలు, స్వదేశీ భావన, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పిస్తున్నామని వివరించారు.
'గడపలోపల కులం – గడప దాటితే హిందువులం' అనే నినాదం సభలో మార్మోగింది. విభజనలకు తావులేకుండా సమసమాజ నిర్మాణం వైపు అడుగులు వేయాలని నేతలు పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం జరిగిన ఈ సమ్మేళనంలో స్థానిక నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.










