ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీస్ శాఖ 'సీపీతో ఒక రోజు' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పోలీసుల పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఈ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ వినూత్న కార్యక్రమం ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రతిరోజూ ఒక పాఠశాల నుంచి ఎంపిక చేసిన 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు (10 మంది బాలురు, 10 మంది బాలికలు) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసు విభాగంలోని వివిధ విభాగాలను సందర్శిస్తారు. ఈ సందర్శనలో భాగంగా విద్యార్థులు సీసీఎస్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ సెల్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ వింగ్ వంటి కీలక విభాగాలను పరిశీలిస్తారు.
కార్యక్రమంలో భాగంగా, పోలీస్ కమిషనర్ విద్యార్థులతో కలిసి వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించే ప్రక్రియను, వాటి పరిష్కార విధానాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. అనంతరం వారికి పుస్తకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆయా విభాగాల అధికారులు నేరాల నియంత్రణలో సాంకేతికత పాత్ర, మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలను విద్యార్థులకు వివరించారు.
పోలీస్ వ్యవస్థ కేవలం నేరాలను అదుపు చేసే యంత్రాంగం మాత్రమే కాదని, సమాజ భద్రతకు భరోసా ఇచ్చే సేవా వ్యవస్థ అని పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ అన్నారు. విద్యార్థుల్లో చట్టం పట్ల గౌరవం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల ముప్పు వంటి సామాజిక సమస్యలపై విద్యార్థులను చైతన్యపరుస్తూ, పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించి, వారి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్నారు.










